Reading Time: < 1 minute
Trump Reacts Shooter Manifesto Reporter Clash Whcd Incident Cole Allen

వాషింగ్టన్ వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్ అనే దుండగుడు తుపాకులతో విరుచుకుపడ్డాడు. అత్యంత వేగంగా భద్రతా సిబ్బంది స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అయితే నిందితుడు కాల్పులకు తెగబడక ముందు తన లక్ష్యానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులకు పంపించినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో అధ్యక్షుడు, ఉన్నతాధికారుల లక్ష్యంగా దాడి చేయబోతున్నట్లుగా సందేశం పంపించాడు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మినహా అధికారులంతా లక్ష్యమని చెప్పాడు.

అయితే అధ్యక్షుడు ట్రంప్‌‌పై నిందితుడు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ‘‘ఒక పీడోఫైల్, అత్యాచారి, దేశద్రోహి. ఇకపై నా చేతులు కలుషితం కావడం సహించను’’ అంటూ ట్రంప్‌ను గురించి నిందితుడు రాసినట్లుగా శోధించారు.

అయితే ఆదివారం సీబీఎస్ న్యూస్‌‌కు చెందిన జర్నలిస్ట్‌తో ట్రంప్ మాట్లాడుతుండగా.. విలేకరి మధ్యలో కలుగజేసుకుని.. నిందితుడు మీ గురించి ఇలా రాశాడంటూ చదవడం మొదలు పెట్టింది. అంతే ఒక్కసారిగా ట్రంప్ సంయమనం కోల్పోయారు. తానేమీ రేపిస్ట్‌ను కాదని.. అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని.. ఇక చదవడం ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌స్టీన్ ఫైల్స్‌తో ట్రంప్‌నకు సంబంధం ఉందన్న నేపథ్యంలో ఈ సందర్భం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తనకు ఎప్‌స్టీన్ ఫైల్స్ సంబంధం లేదని.. ఆ ఆరోపణల నుంచి పూర్తిగా విముక్తి పొందానని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇక షూటర్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడు రాడికలైజ్ అయ్యాడు. ముందుగా అతడు క్రైస్తవ విశ్వాసి. తర్వాత యాంటీ క్రిస్టియన్‌గా మారాడు. ప్రస్తుతం మానసిక రోగి అయి ఉండొచ్చు.’’ అని పేర్కొ్న్నారు. అమెరికాలో రాజకీయ హింస పెరగడానికి డెమోక్రటిక్ నాయకుల హేట్ స్పీచే కారణమని.. ఇది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కాల్పుల సమయంలో తాను భయపడలేదన్నారు. కొద్దిసేపు అక్కడే ఉందామని భద్రతా సిబ్బందికి చెప్పినట్లు తెలిపారు. గత రెండేళ్లలో ఇది మూడో హత్యాయత్నం అని.. మళ్లీ ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ట్రంప్ స్పష్టం చేశారు.