Reading Time: < 1 minute
Ashu Reddy Fraud Case London Nri Dharmendra Allegations Details

ప్రముఖ సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డిపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లండన్‌లో నివసిస్తున్న ధర్మేంద్ర అనే వ్యక్తి, ఆశు రెడ్డి తనను ప్రేమ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిందని ఎన్టీవీ (NTV)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి తనను నిండా ముంచిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఎనిమిదేళ్లుగా తన నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిందని లండన్ నివాసి ధర్మేంద్ర ఆరోపించారు. కేవలం అషు రెడ్డి మాత్రమే కాకుండా, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ మోసంలో భాగస్వాములని ఆయన పేర్కొన్నారు. ధర్మేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకుంటాననే సాకుతో అషు రెడ్డి ఇప్పటివరకు సుమారు 9.30 కోట్ల రూపాయలను తన నుంచి తీసుకుంది. తన డబ్బుతోనే ఆమె విలాసవంతమైన ఇల్లు, కారు మరియు బంగ్లాలను కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. అషు రెడ్డి సోదరికి 75 లక్షల రూపాయల విలువైన డాలర్లు, అలాగే ఆమె తండ్రికి 92 లక్షల రూపాయలను బదిలీ చేసినట్లు ధర్మేంద్ర సాక్ష్యాధారాలతో సహా ఆరోపించారు.

నిశ్చితార్థం, పెళ్లి అని నమ్మించి రెండుసార్లు ముహూర్తాలు కూడా ఖరారు చేయించుకుందని, తీరా పెళ్లి సమయం దగ్గరపడేసరికి క్యాన్సిల్ అంటూ డ్రామాలు ఆడిందని ఆయన వాపోయారు. ఎనిమిదేళ్ల బంధాన్ని కేవలం డబ్బు కోసమే ఆమె వాడుకుందని ధర్మేంద్ర విమర్శించారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు ఆశు రెడ్డి అసలు స్వరూపం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. తనపై వేధింపుల కేసులు పెట్టి ఇబ్బంది పెడతానని ఆశు రెడ్డి బెదిరించినట్లు ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో తన డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని కూడా భయపెట్టిందని వెల్లడించారు. ఏడాది కాలంగా మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ చేసుకుందామని చెబుతూ, సమయం గడుపుతూ తనను వేధిస్తోందని ధర్మేంద్ర అన్నారు. “అషు రెడ్డి, ఆమె కుటుంబం నుంచి నాకు ప్రాణభయం ఉంది. అందుకే భరించలేక పోలీసులను ఆశ్రయించాను. న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను.” అని బాధితుడు ధర్మేంద్ర పేర్కొన్నారు.