ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ, ఎటువంటి హడావుడి లేకుండా అత్యంత సన్నిహితుల మధ్య ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకుని అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అలాగే ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ మెహ్రీన్ భర్త గురించి తెలుసుకుందామా.
మెహ్రీన్ వివాహం హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక అందమైన రిసార్ట్‌లో ఆదివారం ఉదయం (ఏప్రిల్ 26, 2026) జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫోటోలలో మెహ్రీన్ సాంప్రదాయబద్ధంగా ఎంతో అందంగా కనిపిస్తూ తన వైవాహిక జీవితంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెహ్రీన్ వివాహం చేసుకున్న వ్యక్తి పేరు అర్ష్ ఔలక్.
సమాచారం ప్రకారం, ఆయనకు సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. అర్ష్ ఒక వ్యాపారవేత్త లేదా ఇతర వృత్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. మెహ్రీన్ తన భర్తను అభిమానులకు పరిచయం చేస్తూ పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెహ్రీన్ గతంలో 2021లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు, రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
అప్పట్లో వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నిశ్చితార్థాన్ని మెహ్రీన్ రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత భవ్య బిష్ణోయ్ ఒక ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోగా, మెహ్రీన్ ఇప్పుడు అర్ష్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పంజాబ్‌కు చెందిన మెహ్రీన్, నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి హిట్ చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
తెలుగుతో పాటు తమిళం, హిందీ, పంజాబీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త సినిమాలేవీ లేకపోవడంతో, మెహ్రీన్ ఇక సినిమాలకు స్వస్తి చెప్పి కుటుంబ జీవితానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మెహ్రీన్, అర్ష్ ఔలక్ దంపతులు నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. చివరగా మెహ్రీన్ ఎఫ్ 3లో కనిపించింది. నిశ్చితార్థం తర్వాత సైలెంట్ అయిన ఆమె.. ఇప్పుడు పెళ్లి ఫోటోలతో ఒక్కసారిగా అభిమానులకు షాకిచ్చింది.




