
Dhanush: తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న నటుల్లో ధనుష్ కూడా ఒకరు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. ఆయన దాదాపుగా చేస్తున్న అన్ని తమిళ సినిమాలను కొంచెం అటు ఇటుగానో తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన హీరోగా నటించిన ‘కర’ అనే సినిమా ఏప్రిల్ 30వ తేదీన తమిళ్‌తో సహా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందుకోసం నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. బుచ్చిబాబు, సాయిధరమ్ తేజ్, వెంకీ అట్లూరి వంటి వాళ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడ వరకు బానే ఉంది కానీ, అందరి స్పీచ్‌లు పూర్తయ్యాక మాట్లాడిన ధనుష్, సెలబ్రిటీల గురించి మాట్లాడిన మాటలు ఆయా వ్యక్తులకు ఎలా ఉన్నాయో తెలియదు కానీ, వారి అభిమానులను మాత్రం ఒప్పించేలా లేవు.
అక్కడ ధనుష్ మాట్లాడుతూ.. “కర అనేది రెండు అక్షరాల పదం, ఇంగ్లీషులో అయితే నాలుగు అక్షరాలు. కానీ దీని వెనుక ఏం మిస్టరీ ఉందో తెలియదు కానీ, చాలామంది కరా అని, కారా అని సంబోధిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, దయచేసి కరెక్ట్ గా పలకండి. ఒకవేళ పలకలేకపోయినా పర్వాలేదు, థియేటర్లకు మాత్రం వెళ్లి సినిమా చూడండి” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ తమ హీరోయిన్, తమ నిర్మాతకే ఈ సినిమా పేరు పలకడం రాలేదంటూ వారి మీదకు తోసి వేసే ప్రయత్నం చేశాడు కానీ, అంతకుముందు మాట్లాడిన దర్శకుడు బుచ్చిబాబును ఉద్దేశించే ఇలా మాట్లాడాడు అనే వాదన నెటిజన్లలో వినిపిస్తోంది.
నిజానికి బుచ్చిబాబు మాట్లాడుతూ.. “ఈ కర అనే సినిమా పేరు వింటుంటే తనకు కాళీపట్నం రామారావు మాస్టర్, అంటే కారా మాస్టారు గుర్తొస్తున్నారు” అని, విశాఖపట్నంకు చెందిన ఆయన గురించి కచ్చితంగా సాహితీవేత్తలు అందరికీ తెలిసే ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి కర, కారా రెండు వేరువేరు పదాలు. కానీ అప్పటి వరకు తన సినిమా షూటింగ్ బిజీలో ఉండి, అది పూర్తి చేసుకుని మరి తనను ఆహ్వానించిన వారి కోరిక కాదనలేక వచ్చిన బుచ్చిబాబు, సాహితీవేత్త కాళీపట్నం రామారావు మాస్టారుని గుర్తు చేసుకున్న విషయంలో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు.
కానీ ధనుష్ మాత్రం తమ హీరోయిన్, నిర్మాత సరిగా పలకలేదని పేర్కొనడంతో, ఆయన బుచ్చిబాబును ఉద్దేశించే మాట్లాడి ఉంటారేమో అని చర్చ సాగుతోంది. ధనుష్ పైకి చెప్పకపోయినా ఆయనలో మాత్రం ఒక రకమైన అసహనం కనిపించింది. కానీ నిజానికి ధనుష్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేరు పలకడం ఒక్కోసారి ఒక్కో భాషలో ఒక్కొక్క రకంగా అనిపించవచ్చు. అంతెందుకు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న రాంచరణ్ ‘పెద్ది’ సినిమాని ధనుష్ ‘పెడ్డి’ అని, అలాగే బుచ్చిబాబు పేరును ‘బుజ్జి బాబు’ అని సంబోధించారు. అంతమాత్రాన ఇక్కడ ధనుష్ తప్పు ఉంది అనడంలో ఎలాంటి పాయింట్ లేదు.
ధనుష్ ఈ విషయంలో తొందరపడి మాటలు అనకుండా ఉండి ఉంటే బాగుండేదని చర్చ సాగుతోంది.
నిజానికి తమిళ, మలయాళ సినిమాల పేర్లు మార్చకుండా అలానే తెలుగు ప్రేక్షకుల నెత్తిన రుద్దుతున్నారనే వాదన చాలామంది తెలుగు భాషాభిమానుల్లో ఉంది. ఈ సినిమా విషయానికి వచ్చినా అదే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాలో హీరో పేరు కరస్వామి, అందులో సగం ‘కర’ అంటూ టైటిల్ ఫిక్స్ చేశారు. తమిళం వరకు అది కొంచెం నోటెడ్ పేరు అయి ఉండవచ్చు కానీ, తెలుగులో కర అనే పేరు అంత రిలేటబుల్ కాదు. అయినా తెలుగు ప్రేక్షకులు సినిమా బావుంటే పేరుతో సంబంధం లేకుండా ఆదరిస్తారు, ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇలా పేరు పలకడం రాలేదు అంటూ ధనుష్ మాట్లాడి ఉండకూడదేమో అనే వాదన వినిపిస్తోంది. “సరిగా పలకండి, ఇది ప్రొనౌన్సేషన్” అని చెప్పి ఉండవచ్చు కానీ, “కరా అంటున్నారు, కారా అంటున్నారు” అంటూ ఎద్దేవా చేసినట్లు మాట్లాడాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.