Reading Time: < 1 minute
Trump Lincoln Reply Why Threats Keep Happening

Donald Trump: మూడేళ్లలో మూడోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం నుంచి బయటపడ్డారు. తాజాగా, శనివారం వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్’ విందులో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన తర్వాత ట్రంప్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఇది ఊహించని పరిణామం’’అని అన్నారు.

అయితే, విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్న మాత్రం అన్నింటి కన్నా ప్రత్యేకంగా నిలిచింది. ఫాక్స్ న్యూస్ విలేకరి పీటర్ డూసీ.. ‘‘మీకే ఇలా పదే పదే ఎందుకు జరుగుతుందని భావిస్తున్నారు?’’ అని కాల్పుల ఘటన గురించి ప్రశ్నించారు. దీనికి ట్రంప్ ‘‘అబ్రహం లింకన్’’ను ఉదాహరణగా చెబుతూ సమాధానం ఇచ్చారు.

‘‘ అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులు, అత్యధిక కృషి చేసి వ్యక్తులు, ఉదాహరణకు అబ్రహం లింకన్ ను చూడండి, ఎవరైన భారీ ప్రజాధరణ కలిగి ఉంటారో వారినే ఇలాంటి వ్యక్తులు టార్గెట్ చేస్తారు’’ అని ట్రంప్ అన్నారు. తాను దేశం కోసం చాలా పనులు చేశానని, ఈ దేశాన్ని మార్చానని, అయితే ఈ విషయంపై సంతోషంగా లేని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతారని ట్రంప్ సమాధానం ఇచ్చారు. ప్రజా జీవితంత ప్రమాదకరమైన జీవితమని, ఇలాంటి ఘటనలు జరిగితే చాలా మంది మానసికంగా కుంగిపోతారు, కానీ నేను అలాంటి వ్యక్తిని కాదని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాలు:

శనివారం జరిగిన ఘటనకు ముందు జూలై 2024లో పెన్సిల్వేనియాలోని బట్లర్ లో జరిగిన ఒక ప్రచార సభలో ఒక వ్యక్తి పైకప్పు నుంచి ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ట్రంప్ తృటిలో తప్పించుకున్నాడు. బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ పక్క నుంచి వెళ్లింది. ఈ ఘటనలో ట్రంప్‌కు చిన్న గాయమైంది. భద్రతా బలగాలు నిందితుడైన 20 ఏళ్ల థామస్ క్రూక్స్‌ను కాల్చి చంపాయి.

కొన్ని నెలల క్రితం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌ గోల్ఫ్ కోర్సులో ట్రంప్ ను చంపాలనే ఉద్దేశంతో దాక్కుని ఉన్న వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. అధ్యక్షుడిని చంపాలని చూసినందుకు నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఫిబ్రవరిలో 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్ అనే యువకుడు ట్రంప్ ఫ్లోరిడా నివాసం మారా లాగో రిసార్ట్2లో తుపాకీతో ప్రవేశించాడు. సీక్రెట్ ఏజెంట్లు అతడిని కాల్చి చంపారు.