Reading Time: < 1 minute
Virat Kohli Creates History 9000 Runs Ipl Rcb Vs Delhi Capitals

Virat Kohli Creates History With 9000 IPL Runs: ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ఈ లీగ్ చరిత్రలో కనీసం 8000 పరుగుల మార్కును సైతం ఎవరూ చేరుకోలేకపోయారు. కానీ కోహ్లీ ఏకంగా 9000 పరుగుల రికార్డును ఖాతాలో వేసుకుని తన స్థాయి ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చరిత్ర సృష్టించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో పవర్‌ప్లే చివరి బంతికి సింగిల్ తీసి కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.

కోహ్లీ నిలకడ ఎంత భీభత్సంగా ఉందంటే, ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ (7183 పరుగులు) కంటే 1829 పరుగులు ఆధిక్యంలో ఉన్నాడు. రోహిత్ కంటే తక్కువ ఇన్నింగ్స్ ఆడి ఇంతటి భారీ వ్యత్యాసాన్ని సాధించడం కోహ్లీ బ్యాటింగ్ పరాక్రమానికి నిదర్శనం. గత 19 ఏళ్లుగా లీగ్‌లో కొనసాగుతున్నా, వయసుతో సంబంధం లేకుండా తన ఆటలో కొత్తదనాన్ని, దూకుడును జోడిస్తూ కోహ్లీ దూసుకుపోతున్నాడు. కేవలం పరుగులు చేయడమే కాకుండా, వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే స్ట్రైక్ రేట్‌ను పెంచుకోవడం కోహ్లీలోని ప్రత్యేకత. ప్రస్తుతానికి ఐపీఎల్ టాప్ స్కోరర్ల జాబితాను చూస్తే కోహ్లీ 9012 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (7183 ) శిఖర్ ధావన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), కెఎల్ రాహుల్ (5580) వరుసాగా కొనసాగుతున్నారు.

ఇక ఈ రికార్డు మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్రదర్శన సైతం మైమరిపించేలా సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసిన బెంగళూరు జట్టు, ఏడో ఓవర్‌లోనే విజయాన్ని ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేవలం 75 పరుగులకే కుప్పకూలిపోగా, ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీ ఉగ్రరూపం దాల్చింది. కేవలం 6.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించి ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన రన్ ఛేజ్‌ను నమోదు చేసింది. ఈ విజయంలో కోహ్లీ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించడమే కాకుండా, 9వేల పరుగుల వీరుడిగా తన పేరును చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.