Reading Time: 2 minutes
Vaibhav Suryavanshi : కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు.. వైభవ్ మళ్ళీ బ్యాట్ పడతాడా?.. కోచ్ ఏమన్నాడంటే ?

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో తన సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగి, రికార్డు స్థాయి సెంచరీ బాదిన వైభవ్ గాయం బారిన పడటం అభిమానులను కలవరపెడుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను వణికించిన ఈ వండర్ కిడ్ తదుపరి మ్యాచ్ ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. దీనిపై రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

అసలేం జరిగింది?

శనివారం (ఏప్రిల్ 25) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో 103 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వైభవ్ ఒక్కసారిగా కుంటుతూ కనిపించాడు. హ్యామ్‌స్ట్రింగ్ సమస్య తలెత్తడంతో ఫిజియోలు మైదానంలోనే అతనికి చికిత్స అందించారు. దీంతో అతను తదుపరి మ్యాచ్ ఆడతాడా లేదా అనే ఆందోళన మొదలైంది.

కోచ్ విక్రమ్ రాథోడ్ ఏమన్నారు?

వైభవ్ గాయంపై రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. “వైభవ్‌కు హ్యామ్‌స్ట్రింగ్ వద్ద కొంచెం నొప్పిగా అనిపించింది. అందుకే ఫీల్డింగ్‌లో ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రాథమిక చికిత్స తర్వాత అతను బాగానే ఉన్నాడు. మరో ఒకటి రెండు రోజుల్లో అతని పరిస్థితిపై పూర్తిగా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి అది తీవ్రమైన గాయంలా అనిపించడం లేదు” అని ఆయన చెప్పుకొచ్చారు.

తదుపరి మ్యాచ్ ఆడతాడా?

రాజస్థాన్ రాయల్స్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 28న ముల్లాంపూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు వైభవ్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ గాయం తీవ్రత తక్కువగా ఉంటే వైభవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే, సుదీర్ఘ టోర్నీ దృష్ట్యా మేనేజ్‌మెంట్ అతనికి ఒక మ్యాచ్ విశ్రాంతి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతను లేకపోతే రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 357 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 234.87గా ఉండటం గమనార్హం. ప్రస్తుతం అభిషేక్ శర్మ (380 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, వైభవ్ అతనికి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ చిన్న వయసులో అతను చూపిస్తున్న పరిణతి చూసి క్రికెట్ దిగ్గజాలు సైతం ఫిదా అవుతున్నారు. వైభవ్ త్వరగా కోలుకుని మళ్ళీ సిక్సర్ల వర్షం కురిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి