July 17, 2026

KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
Reading Time: < 1 minute
Kcr Comments On Congress Government Telangana Brs Meeting Criticism

KCR : తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ (BRS) ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును చూస్తుంటే రాష్ట్రం ‘బొందలో పడ్డట్టు’ అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు వాడుతున్న భాషను తప్పుబడుతూ, ఇది ఒక “చిల్లర ప్రభుత్వం” అని ఆయన సంబోధించారు.

పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఒక్కరు కూడా అడ్డుకోలేదని మండిపడ్డారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే సభలో రణరంగం సృష్టించేవాళ్లమని, తెలంగాణ హక్కుల కోసం గట్టిగా పోరాడేవాళ్లమని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బీఆర్ఎస్‌కు ఉన్న చిత్తశుద్ధి మరే పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. పక్క రాష్ట్రాల ప్రజలు విగ్రహాన్ని చూడటానికి వస్తుంటే గేట్లు కూడా తీయకుండా అవమానించారని, తాము పోరాటం చేసిన తర్వాతే గేట్లు తెరుచుకున్నాయని ఆరోపించారు. ఇక రైతుల పరిస్థితిపై స్పందిస్తూ.. ధాన్యం కొనడం చేతకాక రైతులను గోస పెడుతున్నారని, రైతు బంధు వంటి గొప్ప పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ ఏర్పాటు సమయంలో తాను పడ్డ కష్టాలను కేసీఆర్ ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు ప్రతిపాదించినా తాను ఒప్పుకోలేదని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కోసమే పట్టుబట్టి సాధించానని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించినట్లు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం కోసం తాము పడిన కష్టాన్ని మర్చిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, వారి కూతలకు భయపడేది లేదని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.