Reading Time: < 1 minute
Andhra: పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత రోజురోజుకీ పెరిగిపోతోంది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. శనివారం రాష్ట్రంగా ఉన్న మెజారిటీ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం వాహనదారులను ఆందోళనకు గురిచేసింది. దీంతో పనులన్నీ వదులకుని పెట్రోల్, డీజిల్‌ కోసం క్యూ కట్టారు వాహనదారులు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలాచోట్ల పెట్రోల్ బంక్‌లు బంద్ అయ్యాయి. విజయవాడలోనూ పెట్రోల్‌ బంకుల దగ్గర నోస్టాక్‌ బోర్డులు కనిపించాయి.

గోదావరి జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. వరికోతలు, ఆక్వా చెరువుల నిర్వహణపై డీజిల్‌ కొరత ఎఫెక్ట్‌ పడుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ స్టాక్‌ ఉన్న బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. రాజమండ్రిలోని పలు పెట్రోల్‌ బంకుల దగ్గర నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెరిచి ఉన్న బంకుల ముందు తెల్లవారుజాము నుంచే వాహనదారుల పడిగాపులు కాశారు.

గుంటూరులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలావరకు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో టూ వీలర్‌కి 500 రూపాయలు… ఫోర్‌ వీలర్‌కి వెయ్యి రూపాయల పెట్రోల్‌, డీజిల్ మాత్రమే కొడుతున్నారు. కర్నూలు, నంద్యాలతో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు.

నో స్టాక్ బోర్డులతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిజంగా కొరత ఉందా లేదా బ్లాక్ మార్కట్‌కు తరలిస్తున్నారా అని విచారణ జరుపుతున్నారు. కృత్తిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆయా జిల్లాల కలెక్టర్లు.

అయితే పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉన్న మాట వాస్తవమే అంటున్నారు బంకుల యజమానులు. ఇరాన్-అమెరికా యుద్ధానికి ముందు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా కంపెనీలు డీలర్లకు అప్పుగా పెట్రోల్‌, డీజిల్‌ సప్లయ్‌ చేసేవని.. ఇప్పుడు క్రెడిట్‌ నిలిపివేయటంతోనే కొరత ఏర్పడుతుందంటున్నారు బంకుల నిర్వాహకులు.

పెట్రోల్‌, డీజిల్‌ కొరత వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్టులపై చర్చించారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని.. సీఎస్‌, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌ విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు సీఎం చంద్రబాబు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..