
ముంబైలో దారుణం జరిగింది. ఓ దుండగుడు కత్తితో రెచ్చిపోయాడు. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మతం అడిగి.. కల్మా పఠించమని అడిగాడు. చెప్పకపోవడంతో కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనతో బాధితులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. నయా నగర్ ప్రాంతంలో నివసిస్తున్న జైబ్ జుబేర్ అన్సారీ(31) సోమవారం తెల్లవారుజామున బిల్డింగ్ నిర్మాణ ప్రాంతంలో రాజ్‌కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్ అనే ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. ఇంతలో అన్సారీ అక్కడికి వచ్చి మతం అడిగి.. అనంతరం కల్మా పఠించమని అడిగాడు. వారు చెప్పకపోవడంతో వెంటనే కత్తి తీసుకుని దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తీవ్రంగా గాయపడ్డారు. మిశ్రా స్వయంగా ఆస్పత్రికి వెళ్లగా.. సేన్ మాత్రం స్థానిక వ్యక్తి నయాబ్ షేక్ సాయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. అక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్లాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 90 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై హత్యాయత్నం కేసుతో పాటు రెండు వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టాడన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. థానే కోర్టులో హాజరుపరచగా మే 4 వరకు పోలీస్ కస్టడీ విధించింది.
అయితే ఈ ఘటన వెనుక ఏవైనా ఉద్దేశాలు ఉన్నాయా? లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేసును పోలీసులు, రాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అతని నోట్స్‌లో ‘ఐసిస్’, ‘లోన్ వుల్ఫ్’, ‘జిహాద్’, ‘గాజా’ వంటి పదాలు కనిపించినట్లు తెలుస్తోంది.
అన్సారీ కొంతకాలం అమెరికాలో నివసించినట్లు సమాచారం. వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ అక్కడనే ఉన్నారు. అక్కడ ఉద్యోగం దొరకకపోవడంతో భారత్‌కు తిరిగి వచ్చి.. మిరా రోడ్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తూ ఆన్‌లైన్ ద్వారా కెమిస్ట్రీ క్లాసులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ద్వారా తీవ్రవాద భావజాలానికి లోనైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇక అపోహలు నమ్మొద్దని.. తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.