
Salim Dola: అంతర్జాతీయ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌పై టర్కీ భద్రతా సంస్థలు జరిపిన భారీ ఆపరేషన్‌లో భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ సలీం డోలా (Salim Dola) అరెస్ట్ అయ్యారు. ఇస్తాంబుల్ పోలీసులు, టర్కీ జాతీయ నిఘా సంస్థ (MIT) అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో సలీం చిక్కడం భారత భద్రతా సంస్థలకు పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఇస్తాంబుల్‌లోని బేలికేజు ప్రాంతంలోని ఒక విలాసవంతమైన ఫ్లాట్‌లో సలీం డోలా దాక్కున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నార్కోటిక్స్ విభాగం అధికారులు లోపలికి ప్రవేశించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో అతని వద్ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కి చెందిన పాస్‌పోర్ట్ దొరికినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎవరీ సలీం డోలా..
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డ్రగ్ నెట్‌వర్క్‌లో సలీం డోలా ఒక కీలక సూత్రధారి. భారత్ నుంచి అంతర్జాతీయ దేశాలకు మాదకద్రవ్యాల సరఫరా గొలుసును (Supply Chain) ఇతనే పర్యవేక్షిస్తారు. ఇతని కోసం భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రూ.1 లక్ష రివార్డు ప్రకటించింది. ముంబై పోలీసులు కూడా ఇతని కోసం గత కొంతకాలంగా గాలిస్తున్నారు. సలీంపై ఇప్పటికే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది, దీనివల్ల అంతర్జాతీయంగా అతని కదలికలపై నిఘా ఉంచడం సాధ్యమైంది. సలీం డోలా అరెస్టుతో ముంబై అండర్‌వరల్డ్, డ్రగ్ సిండికేట్ మధ్య ఉన్న సంబంధాలపై కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సలీం టర్కీ అధికారుల కస్టడీలో ఉన్నాడు. అతడిని భారత్‌కు రప్పించేందుకు ఇండియన్ ఏజెన్సీలు ఇప్పటికే టర్కీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. విచారణ పూర్తయితే డ్రగ్ మాఫియాకు చెందిన మరిన్ని పెద్ద తలలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు.