
హర్యానాలోని హిసార్ జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 27, 2026) రాత్రి పెను విషాదం చోటుచేసుకుంది. భివానీ నుండి హన్సీకి ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మిల్క్‌పూర్ గ్రామం సమీపంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదానికి గురైంది. హిసార్-ఢిల్లీ జాతీయ రహదారిపై రామాయణ్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరో 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బస్సు మిల్క్‌పూర్ గ్రామం దాటుతుండగా ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఆ వెంటనే బస్సు మంటల్లో చిక్కుకుంది. మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే, ప్రయాణికులు తేరుకుని బయటపడే లోపే బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే బస్సు పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది.
పోలీసులు, అగ్నిమాపక శాఖ జరిపిన ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రయాణంలో ఉండగా బస్సు టైరు అకస్మాత్తుగా పేలిపోవడం, దాని వల్ల ఏర్పడిన ఘర్షణ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ మంటలు తృటిలో ఇంధన ట్యాంకుకు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి బస్సు బాంబులా పేలిపోయిందని సమాచారం.
ఈ ఘటనలో గాయపడిన 11 మందిని స్థానికులు, పోలీసులు కలిసి సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరణించిన ఇద్దరి మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.
ఈ ప్రమాదం కారణంగా హిసార్-ఢిల్లీ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సు శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..