
PM Modi Speech Live: పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. విపక్షాలు అన్నీ కలిసి మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నాయని ఆరోపిస్తూ.. దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తోంది. కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడికి పాల్పడుతోంది. నల్లజెండాలతో పాటు.. విపక్షాలను తప్పు పడుతూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. కేబినెట్ రివ్యూ సందర్భంగా.. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని.. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలని ప్రధాని మోదీ తెలిపారు. పార్లమెంట్ ముగిసినా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సందర్భంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాత్రి 8.30గంటలకు ప్రసంగం మొదలైంది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, దక్షిణాది ఆందోళనలపై.. రాత్రి ప్రధాని ఏం మాట్లాడబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.