Reading Time: < 1 minute
iCloud: ఐఫోన్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌! ఇలాంటి మెసేజ్‌లు వస్తే జాగ్రత్త..!

ఐఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. యాపిల్‌ iCloud సేవ పేరుతో నకిలీ ఇమెయిళ్లు పంపిస్తూ, యూజర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలను దొంగిలించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ఇటీవల వెలువడిన ఒక నివేదిక ప్రకారం మీ iCloud స్టోరేజ్ నిండిపోయింది అంటూ వేలాది మందికి సందేశాలు చేరుతున్నాయి. ఈ ఇమెయిళ్లలో వినియోగదారులు తమ స్టోరేజ్ పరిమితిని మించిపోయారని, వెంటనే అప్‌గ్రేడ్ చేయకపోతే ఫోటోలు, వీడియోలు తొలగించబడతాయని హెచ్చరిస్తున్నారు. సందేశాల్లో యానేజ్‌ స్టోరేజ్‌ వంటి బటన్‌లను జోడించి, వినియోగదారులను భయపెట్టి ఆ లింక్‌పై క్లిక్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ లింక్‌లు అసలు iCloud వెబ్‌సైట్‌లకు కాకుండా, నకిలీ ఫిషింగ్ పేజీలకు దారి తీస్తాయి.

నిపుణుల హెచ్చరిక ప్రకారం ఈ నకిలీ పేజీలు యాపిల్‌ అధికారిక లాగిన్ పేజీలా కనిపిస్తాయి. వినియోగదారులు తమ యాపిల్‌ ఐడీ లేదా బ్యాంక్ వివరాలు నమోదు చేస్తే, హ్యాకర్లు ఆ సమాచారాన్ని దొంగిలించి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు దోచుకోవడం లేదా డార్క్ వెబ్‌లో విక్రయించడం వంటి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలో వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా iCloud లేదా బిల్లింగ్‌కు సంబంధించిన అనుమానాస్పద ఇమెయిళ్లలోని లింక్‌లపై క్లిక్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. స్టోరేజ్ వివరాలు తెలుసుకోవాలంటే, నేరుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తనిఖీ చేయడం సురక్షిత మార్గమని సూచిస్తున్నారు. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులు జాగ్రత్తగా ఉండడం ద్వారా మాత్రమే ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి