Reading Time: < 1 minute
Telangana: రూ.కోటి విలువైన పాన్‌ మసాలాతో పరారైన డ్రైవర్.. వాటితో ఏం చేశాడో తెలిస్తే..

ఢిల్లీకి చెందిన పాన్ మసాలా వ్యాపారి ఉపాధ్యాయ వినోద్ తన సంస్థ ద్వారా దేశంలోని అన్ని నగరాలకు బాబా పాన్ మసాలాను సప్లై చేస్తుంటాడు. ఆయన వద్ద హర్యానాకు చెందిన సద్దాం కంటైనర్ డ్రైవర్ గా కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు. ఈనెల ఒకటవ తేదీన నోయిడా నుండి హైదరాబాద్ కు ‘బాబా పాన్ మసాలా’ లోడ్‌ కలిగిన కంటైనర్ తో డ్రైవర్ సద్దాం బయలు దేరాడు. అయితే రెండు రోజుల తర్వాత పాన్ మసాలా కంటైనర్ కనిపించకుండా పోయింది. దీంతో పాన్ మసాలా వ్యాపారి ఉపాధ్యాయ వినోద్ ఆందోళన చెందాడు.

ఇక కంటైనర్‌ను ఎటుపోయిందని ట్రాక్ చేయగా యాదాద్రి జిల్లా ఆలేరు సమీపంలోకి వచ్చాక కంటెయినర్ ఆచూకీ లేకుండా పోయిందని గుర్తించాడు. డ్రైవర్ సద్దాంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయ వినోద్ ఈనెల 12న ఆలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ ఉద్యోగంతో వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోక డ్రైవర్ సద్దాం.. కంటైనర్ పాన్ మసాలాపై కన్నేసినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన స్నేహితుడు సిరాజ్ తో కలిసి ఓ పథకం వేసి కంటైనర్‌ను మాయం చేసినట్టు తెలుసుకున్నారు.

ప్లాన్ ప్రకారం ఆలేరు సమీపంలోకి రాగానే సద్దాం క్రషర్ మిల్లు వద్ద కంటైనర్‌ను ఆపేసి సిరాజ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో సిరాజ్ హైదరాబాద్ నుండి డీసీఎం వ్యాన్‌తో కంటైనర్ వద్దకు చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి కంటైనర్ లోని బాబా పాన్ మసాలా కాటన్ లను వ్యాన్ లోకి ఎక్కించి హైదరాబాద్ కు తరలించారు. ఈ సరుకునంతా చంచల్ గూడలోని ఓ గోదాంలో ఉంచి తర్వాత విక్రయించారు.

ఇంతలో రంగంలోకి దిగిన ఆలేరు పోలీసులు కేసును చేదించే పనిలో పడ్డారు. ఫోన్ సిగ్నల్ ద్వారా డ్రైవర్ సద్దాం ఆచూకీ గుర్తించి పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తన స్నేహితుడు సిరాజ్‌తో కలిసి పాన్ మసాలాను దొంగిలించామని డ్రైవర్ సద్దాం నేరాన్ని అంగీకరించారు. ఆలేరు సమీపంలో చోరీకి గురైన రూ. కోటి విలువైన పాన్ మసాలా కాటన్లను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న సిరాజ్ ను కూడా త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.