Reading Time: 2 minutes

ఏప్రిల్17న ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ సర్వే..3 నెలల్లో.. వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌కు భూమిపూజ

Caption of Image.
  • ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో డిఫెన్స్ ఆధ్వర్యంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌.. ఈ నెల 17న ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ సర్వే
  • కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
  • వీలైనంత త్వరగా విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తం
  • కావాల్సిన భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ
  • పెద్దపల్లిలోనూ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్​కు అనుకూలంగా ఫీజిబిలిటీ రిపోర్ట్
  • రాష్ట్ర ప్రభుత్వ స్పందన రాగానే ముందుకెళ్తాం
  • ప్రజా ఆకాంక్షలకు తగ్గట్టు రాష్ట్రంలో మరిన్ని ఎయిర్​పోర్టులు: కిషన్ రెడ్డి
  • రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో కేంద్ర మంత్రుల భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: మూడు నెలల్లో వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అలాగే, ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఆధ్వర్యంలో ఎయిర్‌‌పోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వీలైనంత త్వరగా భూమి పూజ చేస్తామని తెలిపారు. దీంతోపాటు తాజాగా పెద్దపల్లి ఎయిర్‌‌పోర్ట్ కు ఫీజిబిలిటి రిపోర్ట్ సానుకూలంగా వచ్చిందని చెప్పారు. 

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరింత సమాచారం రాగానే ముందుకెళ్తామని అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆదిలాబాద్‌తోపాటు తెలంగాణలో ఇతర ఎయిర్ పోర్ట్‌ల నిర్మాణంపై  కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, సివిల్ ఏవియేషన్ అధికారులు, డిఫెన్స్ అధికారులు, వికాస్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్ పాల్గొన్నారు. 

అనంతరం కిషన్ రెడ్డి నివాసంలో మీడియాతో కేంద్ర మంత్రులు  మాట్లాడారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం కేవలం హైదరాబాద్‌లోనే విమానాశ్రయం అందుబాటులో ఉందని, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఇతర ప్రాంతాల్లోనూ వీటిని నిర్మించాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఐడియల్‌ లొకేషన్‌లో ఆదిలాబాద్‌: రామ్మోహన్‌నాయుడు

ఆదిలాబాద్ చాలా ఐడియల్ లొకేషన్‌లో ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తుచేశారు. తెలంగాణకు ముఖద్వారమైన ఆదిలాబాద్‌లో.. పర్యాటకానికి, వివిధ వాణిజ్య కార్యక్రమాలను ప్రోత్సహించేలా విమానాశ్రయం రావాలన్న ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరనున్నదని తెలిపారు. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న డిఫెన్స్‌ ఎయిర్‌స్ట్రిప్‌ స్థానంలో కొత్త ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో  చర్చించామని, ఆయన సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఉన్న 360 ఎకరాల రక్షణ శాఖ భూమితోపాటు అదనంగా మరో 450 ఎకరాల స్థలం అవసరమని గుర్తించామన్నారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్‌ పంపగా.. సానుకూలంగా స్పందించినట్టు వివరించారు. ఈ విమానాశ్రయాన్ని రక్షణ శాఖ నిర్మిస్తుందని చెప్పారు. 

 ఒక పక్కన సామాన్య ప్రజల కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆధ్వర్యంలో సివిల్‌ టర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. రక్షణ శాఖకు ఇది వ్యూహాత్మక ప్రాంతం కావడంతోపాటు వైమానిక దళ శిక్షణకు కీలకం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ ఎయిర్‌‌పోర్ట్ కోసం ఏప్రిల్‌ 17న సివిల్‌ ఏవియేషన్, డిఫెన్స్‌ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కలిసి విమానాశ్రయాల పరిసరాల్లో విమానాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు నిర్వహించే ‘అబ్‌స్టాకిల్‌ లిమిటేషన్ సర్ఫేసెస్ (ఓఎల్‌ఎస్‌) సర్వే  నిర్వహించనున్నట్టు చెప్పారు.  అనంతరం రన్‌వే ఓరియంటేషన్‌పై నిర్ణయం తీసుకుని మాస్టర్‌ ప్లాన్‌కు అంగీకారం తెలుపనున్నట్టు స్పష్టం చేశారు. ఆ ఫీల్డ్ విజిట్ పూర్తయ్యాక డిఫెన్స్ తర్వాత మాస్టర్ ప్లాన్‌కు అంగీకారం తెలియజేస్తుందని వివరించారు. ఆ తర్వాత ఫౌండేషన్‌కు ప్లాన్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

పెద్దపల్లి ఓకే.. కొత్తగూడెం నాట్‌ ఫీజిబుల్‌

పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన సైట్‌పై ఫీజిబిలిటీ నివేదిక సానుకూలంగా వచ్చినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక సమాధానం వచ్చిన తర్వాత ముందుకెళ్తామని స్పష్టం చేశారు.  ఇక్కడ విమానాశ్రయం కోసం 600 నుంచి 700 ఎకరాల భూమి అవసరమని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కనీసం 1200 ఎకరాలు ఉంటే మేలని అభిప్రాయపడ్డారు. అయితే, కొత్తగూడెం ఎయిర్‌‌పోర్ట్ కోసం రాష్ట్రం ప్రతిపాదించిన స్థలం సాంకేతికంగా ఫీజిబుల్ కాదన్నారు. 

ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పారు. భూసేకరణలో ఎలాంటి సమస్యలు లేవని స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని, ఆదిలాబాద్‌ భవిష్యత్తులో వాణిజ్య హబ్‌గా ఎదిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.

©️ VIL Media Pvt Ltd.