
లోక్‌సభ ఎన్నికలకు మరో మూడేళ్లకు పైగా సమయం ఉంది. ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే బొటాబొటీ ఆధిక్యతతో ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి పదవి చేపట్టగలిగారు. అయినా ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నిలదీయడంతో ప్రతిపక్షాలు విఫలం అవుతున్నాయి. ఎవ్వరి దారి వారిదిగా కనిపిస్తున్నది. ఈ సందర్భంగా త్వరలో జరుగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడులతో పాటు వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఈ ఎన్నికలపై దృష్టి సారించకుండా అకస్మాత్తుగా 2029లో జరిగే ఎన్నికలలో ప్రతిపక్షాల ప్రధానమంత్రి ఎవ్వరు? అనే చర్చ బయలుదేరడం ఒక విధంగా విస్మయం కలిగిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ఇండియా కూటమి దాదాపు నిస్తేజంగా మిగిలింది. ఇప్పుడు ఆ కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం రాహుల్ గాంధీకి లేదని అంటూ ఇతర పేర్లను ప్రస్తావిస్తున్నారు.
ముఖ్యంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ బారు మమతా బెనర్జీ పేరును ప్రతిపాదించగా, మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ పేరును తెరపైకి తెచ్చారు. వీరిద్దరూ కూడా గతంలో యుపిఎ హయాంలో కాంగ్రెస్ ప్రాపకంతో ప్రభుత్వంలో కీలక పదవులు పొందినవారే. వారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం కలగకపోయినా, వారు మంచి గుర్తింపు పొందారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తప్పదనే అంచనాతో ముందుగానే మన్మోహన్ సింగ్‌ను విడిచి వెళ్ళిపోయిన సంజయ్ బారు, ఎన్నికల అనంతరం మళ్ళీ ఆయనే ప్రధాని కావడంతో తిరిగి ప్రభుత్వంలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ ప్రాబల్యం పెరుగుతున్నప్పటి నుండే మణిశంకర్ అయ్యర్ తెరమరుగుకాక తప్పలేదు.
సహజంగానే, సంజయ్ బారు ప్రతిపాదనను టిఎంసి నుండి ఎంపిగా మారిన జర్నలిస్ట్ సాగరికా ఘోష్ సమర్థించారు. టిఎంసి నాయకులతోపాటు డిఎంకె, ఉద్ధవ్ థాకరే శివసేన (యుబిటి) కూడా ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చాయి. ‘ఒక్క తమిళనాడు సిఎం మాత్రమే 2029 ఎన్నికల్లో కూటమికి విజయాన్ని చేకూర్చగలరు’ అంటూ మణిశంకర్ అయ్యర్ చేసిన ప్రతిపాదనకు ఆ పార్టీలోని వారు తప్ప మరెవ్వరూ స్పందించలేదు. పలు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా తన తండ్రి ఎంకె స్టాలిన్ కూటమికి నేతృత్వం వహించాలని కోరుతున్నారని ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ, ప్రజాపాలనలోనూ స్టాలిన్ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మమత, స్టాలిన్ తమ తమ రాష్ట్రాలలో తిరుగులేని నాయకులు కావచ్చు.
అయితే, వారెవ్వరికీ జాతీయ స్థాయిలో ప్రాబల్యం లేదు. ఇతర రాష్ట్రాలలో వారికి ఎటువంటి మద్దతు లేదు. టిఎంసిని జాతీయ పార్టీగా చేసేందుకు మమత ఎంతగా ప్రయత్నించినా గోవా, త్రిపుర, మేఘాలయ వంటి చిన్నచిన్న రాష్ట్రాలలో తాత్కాలికంగా ప్రభావం చూపినా పార్టీని విస్తరింపలేకపోయారు. అట్టడుగు నుండి వీధి పోరాటాల ద్వారా ఎటువంటి కుటుంబ నేపథ్యం లేదా ‘గాడ్ ఫాదర్’ లేకుండా కీలకమైన నేతగా ఎదిగిన దేశంలో ఏకైక మహిళా నేత మమత అనడంలో సందేహం లేదు. పశ్చిమబెంగాల్ కాంగ్రెస్‌లో ప్రియరంజని దాష్ మున్షీ, ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను ధిక్కరించి, సొంతంగా పార్టీ పెట్టుకొని, 34ఏళ్ళ వామపక్ష పాలనకు చరమగీతం పాడారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉండగలిగారు. బిజెపిని సైతం పదేళ్లుగా ఎదుర్కొంటున్నారు. ఆమెను ప్రధాని అభ్యర్థిగా జాతీయ స్థాయిలో మహిళా ఓటర్లను ఆకట్టుకొనే అవకాశం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఆమె మద్దతు పొందటం కష్టమే కాగలదు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో బిజెపికి గట్టి పోటీ ఇవ్వగలిగిన స్థాయిలో కేవలం కాంగ్రెస్ మాత్రమే ఉంది. సుమారు 100 మంది ఎంపిలు ఉన్నారు. సుమారు 300 స్థానాలలో బిజెపికి కీలకమైన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ గెలిచే సీట్లు పెరిగితేనే బిజెపిని గద్దె దించడం సాధ్యం కాగలదు. అందుకనే బిజెపి సైతం కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంటున్నది. ప్రాంతీయ పార్టీల నేతలను అంతగా పట్టించుకోవడం లేదు. విధానపరమైన అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో, బైటా గట్టిగా నిలదీస్తోంది కూడా కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ. అయితే, ఇప్పుడు అనూహ్యంగా 2029లో జరగబోయే ఎన్నికలను ప్రస్తావిస్తూ మమత, స్టాలిన్‌లను ప్రధాని అభ్యర్థులుగా ప్రచారం చేయడం వెనుక రెండు ఉద్దేశాలు ఉండే అవకాశం ఉంది. మొదటగా, మరో రెండు నెలల్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మమత, స్టాలిన్‌లకు తమతమ రాష్ట్రాలలో తిరిగి గెలుపొందేందుకు అటువంటి ప్రచారం ఉపయోగపడే అవకాశం ఉంది.
జాతీయ స్థాయిలో ప్రధాని మోడీని ఓడించగలిగేది వీరే అనే ప్రచారం ఎన్నికల ముందు జరగడం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే అని చెప్పవచ్చు. 15 ఏళ్ళ పరిపాలనలో మమత సహజంగానే కొంత ‘ప్రభుత్వ వ్యతిరేకత’ కు గురయ్యే అవకాశం ఉంది. ‘బెంగాల్ సంస్కృతి’కి తానే ప్రతినిధి అని, బీజేపీ ‘బయటివారి పార్టీ’ అని ఇప్పటివరకు చేస్తున్న ప్రచారం మరోసారి ఏమేరకు ఉపయోగపడుతుంది? అన్నదికూడా ప్రశ్నార్థకం కాగలదు. అందుకనే కొత్తకొత్త ఎత్తుగడలను అనుసరింపక తప్పదు. అందుకనే అటువంటి ప్రచారం పట్ల మమతా మౌనం వహిస్తున్నారు. తమిళనాడులో అధికారంలో భాగస్వామ్యం కోరుతున్న కాంగ్రెస్ నుండి డిఎంకె ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు స్టాలిన్ ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేవడం ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.
మరోవంక, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నేరుగా ప్రధాన మంత్రి మోడీ లక్ష్యంగా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించడంతో బిజెపి ఇరకాటంలో పడిపోయింది. మాజీ సైన్యాధికారి నరవాణె గ్రంథం విషయంలో గాని, భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంలో గాని, జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో గాని రాహుల్ లేవనెత్తిన అంశాలపై అధికార పక్షం నోరు విప్పలేకపోతున్నది. ఈ అంశాలలో నేరుగా ప్రధాని ప్రమేయం ఉండడంతో దేశంలో సైతం ఓ ‘బలమైన నాయకుడు’ గా ఇప్పటివరకు మోడీ చుట్టూ జరుగుతున్న ప్రచారంపై తెరపడింది. ఈ అంశాలపై స్టాలిన్, మమత వంటి ప్రతిపక్ష నేతలు దాదాపు మౌనంగా ఉంటున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఆమోదించిన అవిశ్వాస తీర్మానంపై టిఎంసి సంతకం చేయకపోవడం గమనార్హం. మోడీ ప్రభుత్వ మనుగడకు నితీశ్ కుమార్,చంద్రబాబు నాయుడుల మద్దతు కీలకం అయినప్పటికీ వారిలో ఎవరు మద్దతు ఉపసంహరించుకున్నా తమ అధికారానికి ఢోకా లేదనే ధీమా బిజెపిలో కనిపిస్తున్నది.
అందుకు ప్రధాన కారణం సంక్షోభం ఎదురైతే డిఎంకె, టిఎంసి వంటి పార్టీలు అక్కరకు వస్తాయనే నమ్మకం కూడా కావచ్చు. ఈ కారణాలతో మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఓ విధంగా ఒంటరి పోరాటం జరపాల్సి వస్తుంది. ఇదే సమయంలో రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీపై అమెరికాలో 15 నెలల కిందట నమోదైన కేసులో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) నోటీసులను స్వీకరించడానికి అదానీ న్యాయవాదులు అంగీకరించడంతో ఈ కేసు ఇటీవలే చివరి దశకు చేరినట్లయ్యింది. ట్రంప్ విధించిన టారిఫ్‌లపై అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి ముందుగానే ఈ కారణాలతోనే హడావుడిగా భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడంపై విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ఈ పరిణామాలను గుర్తించిన సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ 2029 ప్రధానమంత్రి అభ్యర్థి గురించి ఇప్పుడు ఆలోచించడం ఏమిటని అంటూ ఈ చర్చకు దూరం జరిగారు.
పైగా, ప్రతిపక్షాలు తమ ముందున్న ప్రాధాన్యతలను మరచిపోకూడదని సున్నితంగా మందలించారు. ‘మొదట, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో బిజెపిని ఓడించాలి’ అని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతానికి, మేము వేరే దేని గురించి ఆలోచించడం లేదు. బిజెపియేతర పార్టీలు తమతమ రాష్ట్రాలలో అధికారం చేపట్టకుండా నిరోధించడానికి కొత్త ‘రాజకీయ చిక్కులు’ కోరుకోవడం లేదు’ అని తేల్చి చెప్పారు. ఆ మాత్రం రాజకీయ పరిపక్వత మిగిలిన ప్రతిపక్ష నాయకులలో లోపించిందని చెప్పలేం. వ్యూహాత్మకంగానే, తమ తమ రాజకీయ అవసరాల కోసమే ప్రధాని అభ్యర్థి గురించి చర్చకు ఆజ్యం పోస్తున్నట్లు స్పష్టం అవుతుంది. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను దగ్గరకు చేర్చి ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర వహించింది నితీశ్ కుమార్. ఆయననే ఆ కూటమికి నాయకత్వం వహించాలని దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నుండి కాకుండా మమత నుండి అభ్యంతరం వ్యక్తమైంది. దానితో నితీశ్ తిరిగి ఎన్‌డిఎ గూటికి చేరుకున్నారు. నితీశ్ ఇండియా కూటమిలో కొనసాగి ఉంటే బీహార్‌లో ఆ కూటమికి అత్యధిక స్థానాలు లభించి ఉండేవి. అప్పుడు కేంద్రంలో ఎన్‌డిఎ మెజారిటీ సాధించడం కష్టమై ఉండెడిది. ఇండియా కూటమి కూడా అధికారానికి అందుబాటులోకి వచ్చెడిది.
చలసాని నరేంద్ర
98495 69050