అయోధ్య రామ మందిర జనరల్ సెక్రటరీగా కృష్ణమోహన్

లక్నో: అయోధ్య రామ మందిర ట్రస్ట్ నూతన జనరల్ సెకట్రరీగా కృష్ణమోహన్ నియమితులయ్యారు. చంపత్ రాయ్ స్థానంలో ఆయనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. కాగా, అయోధ్య రామ మందిర విరాళాల్లో గోల్ మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్రస్ట్ మాజీ జనరల్ సెకట్రరీ చంపత్ రాయ్ ప్రధాన అనుచరుడు టిన్ను యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి చంపత్ రాయ్ రాజీనామా చేశారు. అలాగే, ట్రస్ట్ మెంబర్ అనిల్ మిశ్రా సైతం తన పదవికి రిజైన్ చేశారు. రామ మందిర విరాళాల గోల్ మాల్ ఆరోపణల నేపథ్యంలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం (జులై 6) కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాకు ట్రస్ట్ ఆమోదం తెలిపింది.
సమావేశం అనంతరం శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రామ మందిరంలో చోరీ ఘటనపై ట్రస్ట్ తీవ్రంగా బాధపడిందని తెలిపారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదించినట్లు స్పష్టం చేశారు.
ముందుగా జులై 11న ట్రస్ట్ కార్యవర్గం సమావేశం కావాలని నిర్ణయించామని.. కానీ ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సోమవారమే (జులై 6) భేటీ అయ్యామని తెలిపారు. సిట్ తుది నివేదికపై చర్చించేందుకు జూలై 22న మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను న్యాయస్థానం ముందు నిలబెడతామని.. ప్రజలు శాంతిభద్రతలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.