July 6, 2026

IND vs ENG : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 పోరు.. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా ?

IND vs ENG : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 పోరు.. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా ?
Reading Time: 2 minutes
IND vs ENG : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 పోరు.. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా ?

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా మూడో ఉత్కంఠభరిత పోరుకు నాటింగ్‌హామ్‌లోని చారిత్రాత్మక ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం సిద్ధమైంది. ఈ హై-స్కోరింగ్ మైదానంలో మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానులకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. దానికి ప్రధాన కారణం.. నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే మైదానంలో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సృష్టించిన పరుగుల తుఫానే. మరోసారి ఇరు జట్లు ఈ మైదానంలో తలపడుతుండటంతో, నాటి చేదు జ్ఞాపకాలను తుడిచేసి సరికొత్త రికార్డును లిఖించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అలాగే ఈసారి సూర్య లాంటి మెరుపు ఇన్నింగ్స్ ఎవరు ఆడుతారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మైదానంతో భారత జట్టుకు ఒక మర్చిపోలేని జ్ఞాపకం ముడిపడి ఉంది. 2022 లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారత బౌలర్లను చీల్చిచెండాడుతూ బోర్డుపై 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 216 పరుగుల కొండంత టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. టాప్ ఆర్డర్ కుప్పకూలిన తరుణంలో మైదానంలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తన సంచలన బ్యాటింగ్‌తో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మైదానం నలుమూలలా 360 డిగ్రీల షాట్లతో విరుచుకుపడుతూ కేవలం 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 6 గగనతలాన్ని తాకే సిక్సర్లతో 117 పరుగులు చేసి అద్భుత శతకాన్ని నమోదు చేశాడు. ఒంటరి పోరాటంతో భారత్‌ను గెలుపు అంచుల్లోకి తెచ్చినప్పటికీ, అవతలి ఎండ్ నుంచి ఎవరి సహకారం అందకపోవడంతో భారత్ ఆ మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐతే, టీ20 చరిత్రలోనే సూర్య ఆడిన ఆ ఇన్నింగ్స్ అత్యంత బెస్ట్ గా నిలిచిపోయింది.

ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో భారత జట్టు గత రికార్డులను పరిశీలిస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. టీమిండియా ఇక్కడ ఇప్పటివరకు మొత్తం 4 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది, మరో రెండు మ్యాచ్‌ల్లో పరాజయాన్ని చవిచూసింది. ఇక్కడి పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకే ఎక్కువగా అనుకూలిస్తుంది. బంతి బ్యాట్‌పైకి చాలా చక్కగా వస్తుండటంతో మరోసారి భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2022 నాటి ఓటమి కసితో ఉన్న టీమిండియా, ఈసారి ఇంగ్లాండ్‌ను వారి హోం గ్రౌండ్‌లోనే మట్టికరిపించి సిరీస్‌లో పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తోంది.

భారత జట్టుతో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక మూడో మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ అత్యంత బలమైన ప్లేయింగ్ ఎలెవన్‎ను అధికారికంగా ప్రకటించింది. గత మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్, విన్నింగ్ కాంబినేషన్‌ను ఏమాత్రం కదల్చకూడదని నిర్ణయించుకుంది. అందువల్ల గత మ్యాచ్ ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తున్నారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ నేతృత్వంలో జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో ఇంగ్లాండ్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్ :

ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, విల్ జాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..