July 6, 2026

ప్రియుడి మోజులో భార్య ఘాతుకం.. భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి మర్డర్

ప్రియుడి మోజులో భార్య ఘాతుకం.. భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి మర్డర్
Reading Time: < 1 minute
ప్రియుడి మోజులో భార్య ఘాతుకం.. భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి మర్డర్

నిజామాబాద్, జులై 6: ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు దారుణానికి ఒడిగట్టింది. పీకల్దాక భర్తకు మందు తాగించి.. ఆనక బాంత్రూమ్‌ క్లీన్‌చేసే హార్పిక్‌ లిక్విడ్‌ని సిరంజితో ఇంజక్షన్‌ చేసి హతమార్చింది. టాయిలెట్ క్లీనర్ హార్పిక్‌ను శరీరంలోకి ఎక్కించి భర్తను హత్య చేసిన ఉదంతం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో ప్రశాంత్, సంధ్య దంపతులు కాపురం ఉంటున్నారు. గత కొంత కాలంగా సంధ్య మరో వ్యక్తితో చనువుగా ఉంటోంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. గతకొంత కాలంగా ప్రశాంత్, సంధ్య గొడవపడుతున్నారు. ప్రశ్నించిన భర్తను శాశ్వతంగా వదిలించుకోవాలని సంధ్య పక్కా స్కెచ్ వేసింది. పథకం ప్రకారం భర్త ప్రశాంత్‌కు అతిగా మద్యం తాగించింది. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి మత్తులో ఉన్న ప్రశాంత్‌పై తీవ్రంగా దాడి చేసి భవనం పై నుంచి కిందకు తోసేశారు.

ఈ ఘటనలో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ అతడు ప్రాణాలతోనే ఉండటం గమనించి ఎలాగైనా అతడిని చంపాలనే ఉద్దేశంతో.. సంధ్య ఇంట్లో ఉన్న హార్పిక్ లిక్విడ్‌ను సిరంజిలోకి తీసుకుని ప్రశాంత్ నరాల్లోకి నేరుగా ఎక్కించింది. శరీరంలోకి విషపూరితమైన క్లీనర్ చేరడంతో ప్రశాంత్ కొద్దిసేపటికే అత్యంత దారుణ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆనక ఏమీ ఎరగనట్టు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసింది. ప్రశాంత్‌ కుటుంబ సభ్యులకు సంధ్య తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. నేరం అంగీకరించింది. దీంతో సంధ్యతోపాటు, ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.