Reading Time: 2 minutes

ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమిస్తోంది. ఈ మహమ్మారి బారినపడిన దేశాల జాబితాలో ఒక్క భారత్ మాత్రమే కాదు, అగ్రరాజ్యం అమెరికా సహా అనేక బడా దేశాలూ ఉన్నాయి. అయినప్పటికీ ఉగ్రవాదంపట్ల బాధిత దేశాలన్నీ చేతులు కలిపి మూకుమ్మడి పోరు సలపలేకపోవడానికి ఎవరి కారణాలు వారివి. ఓటు బ్యాంకు రాజకీయాలు, స్వార్థపర ప్రయోజనాలు ఈ మహమ్మారిపై ఉమ్మడి పోరుకు మోకాలడ్డుతున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాలు ఈ కోవలోకే వస్తాయి. ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్తాన్‌పై అమెరికా ఉదాసీన వైఖరి ఇందుకు ఒక ఉదాహరణ. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులపై నిషేధం విధించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను తన వీటో అధికారంతో అడ్డుకుంటున్న చైనాను మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రవాదంపై ఒంటరిపోరు చేస్తున్న భారత్, మరో అడుగు ముందుకు వేసి ‘ప్రహార్’ పేరిట కౌంటర్ టెర్రరిజంపై ఒక సమగ్ర విధానాన్ని ఆవిష్కరించడం ఎంతైనా ముదావహం. ఉగ్రవాద ముప్పునుంచి దేశాన్ని రక్షించేందుకు ఏడు మూలస్తంభాల్లాంటి అంశాలతో ప్రహార్ రూపుదిద్దుకుంది. ఉగ్రవాద దాడుల ముప్పును ముందే పసిగట్టి ఉప్పందించే నిఘా వర్గాలను మరింత పటిష్ఠం చేయడం, దాడి జరిగినప్పుడు వేగంగా ప్రతిస్పందించడం, ఉగ్రవాదానికి అనుకూలించే పరిస్థితులను నిర్మూలించడం, అంతర్జాతీయ సహకారంతో ఉగ్రవాద నెట్ వర్కులను దెబ్బతీయడం, ఉగ్రదాడుల బాధితులకు పునరావాసం కల్పించడం, సమాజంలో వారిని భాగస్వాములను చేయడం.. ఇవీ ప్రహార్ లోని ప్రధానాంశాలు. ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా ఇందులో కొన్ని అంశాలు ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ, అన్ని అంశాలనూ స్పృశిస్తూ సమగ్రమైన ఒక విధానాన్ని ఆవిష్కరించడం మాత్రం ఇదే మొదటిసారి. ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి అసలు కారణాలను సైతం పసిగట్టి, వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకునేలా ప్రహార్ రూపుదిద్దుకుంది. నిరుద్యోగ యువతకు, పేదలకు డబ్బు ఆశజూపి, వారు హింసాకాండకు పాల్పడేలా చేయడం ఉగ్రవాదులకు వెన్నతో పెట్టిన విద్య. సంక్షేమ పథకాల ద్వారా ఇలాంటి వాటికి పరిష్కారం చూపవచ్చన్న ప్రభుత్వ అభిప్రాయం సరైనదే.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరా చేసుకుని ఉగ్రవాదం సైతం కొత్తపుంతలు తొక్కుతోంది. తుపాకులు, బాంబులకు పరిమితం కాకుండా కృత్రిమమేధ సాయంతో దాడులకు పాల్పడుతున్నారు. సైబర్ దాడులకూ బరితెగిస్తున్నారు. మరోవైపు కశ్మీర్ లోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ వేర్పాటువాదాన్ని ఎగదోస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటినీ అడ్డుకునేందుకు కృత్రిమ మేధను సమర్థవంతంగా వినియోగించే శక్తిసామర్థ్యాలను పెంపొందించుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని మన సైనికులకూ చేరువ చేయాలి. ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్య అనేది నిర్వివాదాంశం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పీస్ సంస్థ ఆ మధ్య విడుదల చేసిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో బుర్కినా ఫాసో, పాకిస్తాన్, సిరియా తొలి మూడు స్థానాల్లో ఉండగా, భారత్ ది ఈ జాబితాలో 14వ స్థానం. భారత్‌ను మించిన ఉగ్రవాద బాధిత దేశంగా రికార్డులకు ఎక్కిన పాకిస్తాన్, తన ఇల్లును చక్కదిద్దుకోకుండా పొరుగింట్లో పొగ పెట్టాలనుకోవడం విచిత్రమే.

అంతర్జాతీయ సహకారం లేనిదే ఉగ్రవాదాన్ని తుదముట్టించడం అసాధ్యమే కావచ్చు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరా చేసుకుని వేరే దేశాల్లో తిష్ఠ వేసుకు కూర్చుని, ఆర్థిక వనరులను ఎరగా వేస్తూ, పేలుడు సామగ్రిని అందజేస్తూ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న ముష్కరుల ఆటకట్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావలసిన అవసరం ఉంది. అందుకు ఆయా దేశాలు సహకరించడం లేదంటూ చేతులు ముడుచుకు కూర్చోకుండా తనవంతు ప్రయత్నంగా భారత్ సాగిస్తున్న ఒంటరి పోరాటం సాధారణమైనదేం కాదు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ పట్ల మునుపటిలా ఉదాసీన వైఖరిని ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు దీటుగా జవాబిస్తోంది. ఆపరేషన్ సిందూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రయిక్స్‌తో ఉగ్రవాదంపట్ల తన వైఖరేమిటో పాకిస్తాన్‌కే కాదు, ప్రపంచ దేశాలకు సైతం చాటిచెబుతోంది. పార్లమెంట్ పై దాడి, ఢిల్లీ బాంబు పేలుళ్లు, 26/11 ముంబయి పేలుళ్లు, పహల్గాం దాడులు వంటి ఉగ్రవాద దుశ్చర్యల వల్ల భారత్ ఇప్పటికే ఎంతో కోల్పోయింది. ఇకపై ఉగ్రవాదానికి మూల్యం చెల్లించుకోవడానికి భారత సిద్ధంగా లేదన్న స్పష్టమైన వైఖరితో ప్రహార్ పేరిట ఆవిష్కరించిన బహుముఖ వ్యూహం ఫలించాలని, ఉగ్రవాద రహిత దేశంగా భారత్ వర్ధిల్లాలనీ కోరుకుందాం.