
భూతగాదాలో వదినపై మరిది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ఇద్దరు మేనల్లుళ్లతో కలిసి ప్లాన్ చేసిన మరిది వ్యవసాయ బావి వద్ద ఒంటరిగా ఉన్న వదినపై కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో మెడపై నరికాడు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితులు, కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. ఈ దారుణ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… పాలడుగు గ్రామానికి చెందిన బొంత వెంకన్న, అశోక్ అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములకు తండ్రి రామయ్య చెరో 8 ఎకరాల చొప్పున 16 ఎకరాల భూమి పంచి ఇచ్చాడు. తమ్ముడు అశోక్ జల్సాలకు అలవాటు పడి తన భాగానికి వచ్చిన భూమిలో సుమారు 5 ఎకరాల వరకు అమ్ముకున్నాడు. దీంతో అన్న వెంకన్న భూమిలో నుంచి కొంత భూమి తనకు ఇవ్వాలంటూ తమ్ముడు అశోక్ గత కొన్నేండ్లుగా గొడవ పడుతున్నాడు. భూతగాదాలతో అనారోగ్యం పాలైన అన్న వెంకన్న సుమారు ఆరు నెలల క్రితం చనిపోయాడు. దీంతో అన్న భూమిపై కన్నేసిన తమ్ముడు వదిన లక్ష్మీని రకరకాలుగా వేదిస్తూ దాడులు, గొడవలకు పాల్పడుతున్నాడు.
ఇంటిపై దాడి చేసి ఇంట్లో వస్తువులన్నీ పగులకొట్టి భూమి పట్టాకాగితాలు, బంగారం ఎత్తుకపోయాడని బాధితురాలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతని నుంచి ప్రాణ భయం ఉండటంతో స్వంత ఇంటిని వదిలి కూతురు, ఇద్దరు కొడుకులతో కలిసి అతని ఇంటికి దూరంగా ఓ పెంకుటింట్లో అద్దెకు ఉంటోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ బావి వద్ద పొలం నాటు వేయగా మంగళవారం కూలీలతో యూరియా చల్లించింది. కూలీలు వెళ్లిపోగా పని ఉండటంతో వదిన లక్ష్మీ బావి వద్దే ఉంది. మేనళ్లుళ్లతో కలిసి రెక్కీ నిర్వహిస్తూ మాటువేసిన మరిది అశోక్ వ్యవసాయ బావి వద్ద వదిన లక్ష్మీ ఒంటరిగా ఉన్నట్టు తెలుసుకుని బావి వద్దకు వెళ్లారు. మేనళ్లుల్లు లక్ష్మీని పట్టుకోగా మరిది అశోక్ కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో లక్ష్మీ మెడపై నరికాడు. చేతులతో అడ్డుకోబోగా రెండు చేతివేళ్లు తెగాయి. కత్తి వేటుతో లక్ష్మీ కేకలు వేయడంతో ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. రక్తస్రావం అవుతుండగా మెడకు టవల్ చుట్టుకుని లక్ష్మీ ఊళ్లోకి వచ్చింది.
లక్ష్మీని తీవ్ర రక్తస్రావంలో చూసిన గ్రామస్తులు వెంటనే 108కు, పోలీసులకు ఫోన్ చేశారు. 108లో లక్ష్మీని చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. లక్ష్మీ కోమాలోకి వెళ్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మరిది అశోక్‌తో పాటు అతని మేనళ్లుల్లు పరారీలో ఉండగా, అశోక్ కుటుంబ సభ్యులు కూడా ఇంటికి తాళం వేసి పరారయ్యారు. మోత్కూరు సీఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడికి ఉపయోగించిన కొబ్బరిబోండాలు కొట్టే కత్తిని స్వాధీనం చేసుకున్నారు. భూతగాదా కారణంగా పెద్ద మనుషుల వద్ద పంచాది నడుస్తోందని, బాధితురాలు లక్ష్మీ పలుమార్లు మోత్కూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. హత్యాయత్నంపై బాధితురాలు లక్ష్మీ అక్క చంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీకి కూతురు రామేశ్వరి, కుమారులు రాంచరణ్, చంద్రశేఖర్ ఉన్నారు.