Reading Time: < 1 minute

ఉప ఎన్నికల్లో ఖాతా తెరిచిన NDA.. తట్టంచవాడి బై పోల్‎లో అశోక్ ఆనంద్ ఘన విజయం

Caption of Image.

పుదుచ్చేరి: పుదుచ్చేరిలోని తట్టంచవాడి ఉప ఎన్నికలో ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎన్‌ఆర్‌సీ అభ్యర్థి అశోక్ ఆనంద్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇ. వినాయగంపై 8,482 ఓట్ల తేడాతో అశోక్ ఆనంద్ గెలుపొందారు. అశోక్ ఆనంద్ 13,358 ఓట్లు సాధించగా, ఇ. వినాయగం 4,876 ఓట్లు పొందారు. ద్రవిడ మున్నేట్ర కజగం అభ్యర్థి సేతు సెల్వం 2,664 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి ఎ.ఎం. సలీం 310 ఓట్లు సాధించగా, నామ్ తమిళర్ కచ్చి అభ్యర్థి ఎస్. కార్తికుమారి 171 ఓట్లు పొందారు. ఈ విజయంతో తట్టంచవాడి సిట్టింగ్ స్థానాన్ని అధికార ఏఐఎన్‌ఆర్‌సీ పార్టీ నిలబెట్టుకుంది. 

2026 ఏప్రిల్‌లో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగసామి మంగళం, తట్టంచవాడి రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మంగళం స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ తట్టంచవాడి సెగ్మెంట్‎కు రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో తట్టంచవాడి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2026, అక్టోబర్ 6వ తేదీన తట్టంచవాడి అసెంబ్లీ సీటుకు ఈసీ ఉప ఎన్నిక నిర్వహించింది. అక్టోబర్ 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టింది. ఈ ఎన్నికల్లో అధికార ఏఐఎన్‌ఆర్‌సీ అభ్యర్థి అశోక్ ఆనంద్ విజయఢంకా మోగించారు. 

©️ VIL Media Pvt Ltd.