Reading Time: < 1 minute
Machilipatnam Fishing Harbour Works Kollu Ravindra Warns Contractor

Minister Kollu Ravindra: మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి హార్బర్‌ను సందర్శించిన ఆయన, పనుల పురోగతిని పరిశీలించి అధికారుల బాధ్యతారాహిత్యం, గుత్తేదారు నిర్లక్ష్య వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ఇంత కీలకమైన ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచిపోవడంపై సంబంధిత అధికారుల తీరును ప్రశ్నించారు. హార్బర్ నుంచే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, కాంట్రాక్టర్ ఉద్దేశపూర్వకంగానే పనుల్లో జాప్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇంతకాలంగా పనులు పూర్తికాకపోతున్నా ఎందుకు దృష్టి పెట్టడం లేదని కలెక్టర్‌ను ప్రశ్నించారు. మూడేళ్ల కాలపరిమితితో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్, ఐదేళ్లు పూర్తయినా నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు.

అవసరమైతే కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించాలని సూచించారు. ప్రాజెక్టు పనులు ఇకపై మరింత ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు, పనులు పూర్తి చేయడానికి మరో నాలుగు నెలల సమయం ఇవ్వాలని గుత్తేదారు మంత్రిని కోరారు. ఇప్పటికే రెండేళ్లపాటు గడువు పొడిగించినా పనుల్లో పురోగతి లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం సమయం ఇవ్వాలని ప్రశ్నించారు. సీ మౌత్ (Sea Mouth) డిజైన్ అందకపోవడం వల్లే పనుల్లో జాప్యం జరిగిందని గుత్తేదారు వివరణ ఇచ్చారు. అయితే, ఇలాంటి కుంటిసాకులు ఇంకెన్ని రోజులు చెబుతారని మంత్రి మండిపడ్డారు.

ఇకపై పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. తక్షణమే పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతోపాటు కాంట్రాక్టర్ ఆస్తులను జప్తు చేసే చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేయడంలో ఇకపై ఎలాంటి జాప్యానికీ అవకాశం ఇవ్వబోమని తేల్చిచెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర..