
బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ లా రుయినా (Richard La Ruina) రెండోసారి భారత్‌లో పర్యటిస్తున్నాడు. గతంలో రచయితగా పనిచేసిన అతను తన భారత పర్యటన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. భారత్ గురించి సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఎక్కువగా ప్రతికూల కంటెంట్ కనిపించడం బాధ కలిగిస్తోందని అన్నాడు. అతని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
భారత్‌పై ప్రతికూల ప్రచారమే ఎందుకు?
భారత్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న దాదాపు ప్రతి పోస్టు, యూట్యూబ్ వీడియో ప్రతికూలంగానే ఉంటోందని, వాటిలో కొన్ని జాత్యహంకార ధోరణితో ఉంటున్నట్లు అభిప్రాయపడ్డాడు. సుమారు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశానికి వచ్చి, ఇక్కడి చెడు అంశాలను మాత్రమే వెతికి వీడియోలు చేయడం.. వాటి ద్వారా లక్షలాది వ్యూస్ సంపాదించడం కొందరు కంటెంట్ క్రియేటర్లకు అలవాటుగా మారిందని కామెంట్ చేసాడు. దేశంలోని పేద ప్రాంతాలను మాత్రమే చిత్రీకరించి, మొత్తం భారత్ అలాగే ఉంటుందనే భావన కలిగించడం సరికాదన్నాడు.
పేదరికం, అపరిశుభ్రతనే చూపిస్తారా?
కొంతమంది కంటెంట్ క్రియేటర్లు తమకు కావాల్సిన విధంగా భారత్‌ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని రిచర్డ్ విమర్శించాడు. మురికివాడలు, అపరిశుభ్రంగా కనిపించే వీధులు, స్ట్రీట్ ఫుడ్‌కు సంబంధించిన ప్రతికూల దృశ్యాలను ఉద్దేశపూర్వకంగా చిత్రీకరిస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని భావిస్తున్నారనీ అన్నాడు. అయితే, భారత్ అంటే అవే కాదనీ, దేశంలో అందమైన ప్రదేశాలు, అద్భుత ఆతిథ్యం, ఆప్యాయంగా పలకరించే ప్రజలు కూడా ఉన్నారని గుర్తుచేశాడు. తన పర్యటనలో కావాలంటే మురికివాడలకు వెళ్లి, వీధిలో ఆహారాన్ని చూపిస్తూ వీడియోలు చేయవచ్చని, కానీ తాను అలా చేయకుండా అందమైన ప్రదేశాలను సందర్శించాననీ వివరించాడు.
‘భారతీయుల ఆతిథ్యం ప్రపంచంలోకెల్లా ప్రత్యేకం’
భారత్‌లో తనకు ఎదురైన అనుభవాలను రిచర్డ్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తాను సందర్శించిన ప్రాంతాల్లో ప్రజలు ఎంతో మంచిగా వ్యవహరించారని, సేవలు కూడా అద్భుతం అన్నాడు. ‘అతిథి దేవోభవ’ అనే సంస్కృతి భారతీయుల ఆతిథ్యంలో కనిపిస్తుందని, తన పర్యటన సమయంలో గాలి నాణ్యత కూడా బాగానే ఉందని, తాను సందర్శించిన ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నామని తెలిపాడు.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో జీవనశైలి ఒకేలా మారుతున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం కొత్తదనం, ఆశ్చర్యపరిచే అనుభవాలు ఇంకా మిగిలి ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. భారతదేశం తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందని చెప్పాడు. భారత్‌పై ప్రతికూల ప్రచారం ఎక్కువ పర్యాటకుల సంఖ్య తక్కువని అభిప్రాయపడ్డాడు. జపాన్‌లోని ఒసాకా నగరాన్ని తన పోస్టులో ప్రస్తావిస్తూ.. ఆ ఒక్క నగరానికి వచ్చే పర్యాటకులతో పోలిస్తే భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య చాలా తక్కువని అన్నాడు.
రిచర్డ్ పోస్ట్‌కు నెటిజన్ల ప్రశంసలు
భారత్‌లోని సానుకూల అంశాలను ప్రస్తావించిన రిచర్డ్ పోస్టుకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. భారత్‌ను సందర్శించి, అక్కడి అనుభవాలను పంచుకున్నందుకు పలువురు నెటిజన్లు అభినందించారు. ‘చాలా మంచి కోణం నుంచి చూసారు. భారత్‌లో మీ పర్యటన ఆనందంగా సాగిందని ఆశిస్తున్నాం’ అని ఒక యూజర్, ‘ఈ ఏడాది తాను రెండోసారి భారత్‌కు రాబోతున్నానని’ మరొకరు రాసుకొచ్చారు. భారత్‌ను సందర్శించకుండా ప్రపంచాన్ని పూర్తిగా చూసినట్లు చెప్పలేమని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఇంకో యూజర్ స్పందిస్తూ.. తాను భారతీయుడినే అయినప్పటికీ దేశంలోని అనేక ప్రదేశాలను సందర్శించలేదని, రిచర్డ్ పోస్టు చదివిన తర్వాత మరిన్ని ప్రదేశాలు చూడాలన్న ఆసక్తి పెరిగిందని తెలిపాడు.