
- ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
- రాష్ట్ర వ్యాప్తంగా 115 పోలింగ్ స్టేషన్లు
- ఆర్టీసీ డిపోలు, వర్క్ షాప్‌లలో ఓట్లు వేయనున్న కార్మికులు
- బరిలో మొత్తం 12 యూనియన్లు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 36 వేల మంది కార్మికులు
హైదరాబాద్, వెలుగు: దశాబ్దం తర్వాత శుక్రవారం ఆర్టీసీలో గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలతోపాటు వర్క్ షాప్ , బాడీ యూనిట్లలో కలిపి మొత్తం 115 పోలింగ్ స్టేషన్లను కార్మికశాఖ ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 12 కార్మిక సంఘాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ప్రధానంగా టీడబ్ల్యూయూ, ఈయూ, ఎస్ డబ్ల్యూఎఫ్, టీఎంయూ, ఎన్ఎంయూ, టీజేఎంయూ, బహుజన వర్కర్స్ యూనియన్ లు గెలుపు కోసం పోరాడుతున్నాయి. సుమారు 36 వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒకటి రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘం కోసం, మరోటి రీజియన్ స్థాయి గుర్తింపు సంఘం కోసం కార్మికులు ఓట్లు వేయనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 17 న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
ఉత్సాహంగా ఆర్టీసీ కార్మికులు..
పదేండ్ల తర్వాత ఈ ఎన్నికలు జరగనుండడంతో ఆర్టీసీ కార్మికులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చివరిసారిగా 2016 లో ఈ ఎన్నికలు జరగ్గా.. అప్పుడు టీఎంయూ గుర్తింపు సంఘం హోదా దక్కించుకుంది. ఇప్పుడు ఈ హోదా కోసం టీఎన్టీయూసీలోని తెలంగాణ వర్కర్స్ యూనియన్ ( టీడబ్ల్యూయూ ) ప్రధానంగా పోటీ పడుతుంది. కాంగ్రెస్ మద్దతుతో ఈ సంఘం ఎన్నికల బరిలో నిలిచింది. ఈ సంఘానికి మద్దతుగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ ప్రచారం సాగించారు. ఇంకో వైపు ఏఐటీయూసీ కూడా తమ అనుబంధ ఆర్టీసీ కార్మిక సంఘం ఈయూ గెలుపు కోసం హోరాహోరిగా పోరాడుతోంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది కాంగ్రెస్సే: రాజిరెడ్డి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది కాంగ్రెస్సేనని తెలంగాణ వర్కర్స్ యూనియన్ ( టీడబ్ల్యూయూ) అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం గాంధీ భవన్ లో మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడబ్ల్యూయూ గెలిస్తే..విలీన ప్రక్రియను వెంటనే పూర్తిచేస్తామన్నారు. ఏఐటీయూసీ మినహా అన్ని యూనియన్లు మద్దతు ఇస్తున్నాయని వివరించారు.