
Kapil Dev Warns Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై దిగ్గజ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఇప్పుడే అతడిని తదుపరి సూపర్‌స్టార్‌గా అభివర్ణించడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డాడు. గతంలో అపార ప్రతిభతో వెలుగులోకి వచ్చి, ఆ తర్వాత కనుమరుగయిపోయిన వినోద్ కాంబ్లీని ఉదాహరణగా ప్రస్తావించాడు. వైభవ్ తన ప్రతిభను దీర్ఘకాలం నిలబెట్టుకోవాలంటే రాబోయే కొన్నేళ్లు అత్యంత కీలకమని కపిల్ దేవ్ సూచించాడు.
బుడ్డోడిపై భారీగా అంచనాలు:
కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. 2026 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఐపీఎల్ 2026లోనూ చెలరేగాడు. 776 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 237కు పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రదర్శనలతో వైభవ్‌కు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల ఆసియా క్రీడలు 2026లోనూ ఆడాడు. దీంతో బుడ్డోడిపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే కేవలం కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌ల ఆధారంగా భవిష్యత్తు గురించి నిర్ణయానికి రావద్దని కపిల్ దేవ్ అంటున్నాడు.
ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు:
‘వైభవ్‌కు అద్భుత ప్రతిభ ఉంది. కానీ ఇంతటి ప్రతిభతో క్రికెట్‌లోకి వచ్చి, ఆ తర్వాత కనుమరుగైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. వినోద్ కాంబ్లీని చూడండి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అంచనాలు అందుకోకపోవడమే కారణం. వైభవ్‌కు మరో మూడేళ్ల సమయం ఇవ్వాలి. అతడి జీవనశైలి, ఆలోచనా విధానం మారే కొద్దీ తనను తాను ఎలా మలుచుకుంటాడన్నదే ముఖ్యం. ప్రస్తుత ప్రదర్శనల కంటే రాబోయే రెండేళ్లలో అతడు ఎలా ఎదుగుతాడన్నదే ముఖ్యమైన విషయం’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
రెండో టీ20లో కూడా చోటు కష్టమే:
భారత మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీ ఒకప్పుడు అసాధారణ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే అతడి కెరీర్ ఆశించినంత సుదీర్ఘంగా కొనసాగలేదు. యువ ఆటగాళ్లకు ప్రతిభతో పాటు క్రమశిక్షణ, సరైన ఆలోచనా విధానం, ఆటపై నిరంతర దృష్టి కూడా అవసరమని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణించడం, ఒత్తిడిని ఎదుర్కోవడం, ఆటలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎదగడం అతడి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. అందుకే యువ ఆటగాడిపై అనవసరమైన ఒత్తిడి పెంచకుండా, అతడికి ఎదగడానికి తగిన సమయం ఇవ్వాలని కపిల్ సూచించాడు. ప్రస్తుతం బుడ్డోడు వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు. సంజు శాంసన్ జట్టులో ఉండడంతో మనోడికి ఈరోజు జరిగే రెండో టీ20లో కూడా చోటు కష్టమే.