Reading Time: < 1 minute
42 Former Judges Defend Sir Warn Against Unsupported Vote Theft Claims

Gyanesh Kumar: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ని వ్యతిరేకిస్తూ, CEC జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, జ్ఞానేష్ కుమార్‌‌కు భారీ మద్దతు లభించింది. 42 మంది మాజీ న్యాయమూర్తులు సీఈసీకి మద్దతుగా నిలిచారు. ఎన్నికల సంఘంEC), న్యాయవ్యవస్థ, ఇతర రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచేలా నిరంతర ప్రచారం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ‘ఓట్ చోరీ’ ఆరోపణలు చేయడం, రాజ్యాంగ సంస్థలను దొంగలుగా, రాజీపడిన సంస్థలుగా పదే పదే చిత్రీకరించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని మాజీ జడ్జీలు హెచ్చరించారు. ‘‘సంస్థల్ని విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ కించపరచడం మాత్రం కాదు’’ అని వారు లేఖలో పేర్కొన్నారు.

SIR ప్రక్రియను కూడా మాజీ న్యాయమూర్తులు సమర్థించారు. ఓటర్ల జాబితా మరింత స్వచ్ఛంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు చట్టబద్ధంగా చేపట్టిన ప్రక్రియ అని అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియను, ఎన్నికల ఫలితాల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ రాజ్యాంగ సంస్థలను పూర్తిగా అనుమానాస్పదంగా చూపించే ప్రయత్నాలు అశాంతికి దారి తీయెచ్చని వారు హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు అరాచక శక్తులకు ఊతమిస్తాయని లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి నమ్మకమే పునాది అని వారు వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలకు అభ్యంతరాలు ఉంటే వాటిని రాజ్యాంగం, చట్టం కల్పించిన మార్గాల్లో పరిష్కరించుకోవాలని మాజీ న్యాయమూర్తులు సూచించారు. ఎన్నికల వివాదాలను న్యాయపరమైన ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవాలని, రాజ్యాంగ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేయకూడదని హితవు పలికారు.

మరోవైపు, CEC జ్ఞానేష్ కుమార్‌పై విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. SIR పేరుతో భారీ సంఖ్యలో అర్హులైన ఓటర్లను తీసేశారని ఆరోపిస్తు్న్నాయి. 2025 నాటి ఓటర్ల జాబితానే కొనసాగించాలని, ఎస్ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓట్లను తొలగించడం వల్ల బీజేపీకి న్యాయం చేకూరుతోందని, సీఈసీ బీజేపీకి ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. SIRకు సంబంధించిన పలు నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారనే మీడియా నివేదికలను ఆధారంగా చేసుకుని విపక్షాలు ఆందోళలు చేస్తున్నాయి.