Reading Time: < 1 minute

నాకు మానసిక ప్రశాంతత ఇచ్చింది సాహిత్యమే : మాజీ జడ్జి మంగారి రాజేందర్

Caption of Image.
  •     అమరుల త్యాగాలు, జనం బాధలే నా అక్షరాలకు ఆయువుపట్టు
  •     మాజీ జడ్జి మంగారి రాజేందర్
  •     వేములవాడ కథల సిరీస్ ఎనలేని కీర్తి తెచ్చిందని కామెంట్

హైదరాబాద్, వెలుగు: న్యాయమూర్తిగా కోర్టులో చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వహించినా.. ఒక రచయితగా, కవిగా సమాజంలోని బాధలను, అన్యాయాలను తన కలం ద్వారా ప్రశ్నించానని మాజీ జిల్లా జడ్జి, ప్రముఖ కవి మంగారి రాజేందర్ అన్నారు. తన సాహిత్యంలో ఎంత ప్రేమ ఉంటుందో.. సామాజిక రుగ్మతలపై అంతే ధిక్కారం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌‌లోని లామకాన్ వేదికగా జరిగిన ‘సాహిత్య రంగంలో నా జీవిత ప్రయాణం’ సదస్సులో ఆయన తన సాహిత్య ప్రయాణాన్ని, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. వృత్తిరీత్యా చట్టాన్ని నమ్మిన తాను, ప్రవృత్తిగా అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్నానని తెలిపారు. తాను రాసిన ‘వేములవాడ కథలు’ సిరీస్ పాఠకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొంది, తనకు రచయితగా ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టిందని గుర్తుచేసుకున్నారు. 

మారుతున్న కాలంలో మనుషులు ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా తన రచనలు సాగాయని వివరించారు. తమ గ్రామం కవులకు, సాహిత్యానికి పుట్టినిల్లు అని, చిన్నప్పటి నుంచి తమ ఊరిలో ఉన్న సాహిత్య వాతావరణం, అక్కడి మట్టి పరిమళాలే తనను కవిగా మార్చాయన్నారు. ఉద్యమ నేల తెలంగాణలో ఎందరో తల్లుల కన్నీటి వ్యథను తన సాహిత్యంలో ప్రతిబింబించానన్నారు. సామాన్యుల కష్టాలు, అమరుల త్యాగాలే తన కలానికి ఆయువుపట్టని స్పష్టం చేశారు. సభకు మోడరేటర్‌‌గా వ్యవహరించిన ప్రముఖ చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. జింబో కేవలం చట్టాన్ని చదివిన జడ్జి మాత్రమే కాదని, సమాజపు అంతరాలను అర్థం చేసుకున్న గొప్ప సామాజిక తాత్వికుడని కొనియాడారు. 

©️ VIL Media Pvt Ltd.