
చెన్నైలోని టైడల్ పార్క్ దగ్గరలో గురువారం ఉదయం ఓల్డ్ మహాబలిపురం రోడ్డు(OMR)లోని కొంత భాగం కుంగిపోయింది. ఒక కారు గుంతలో పడిపోయింది. దీంతో ఈ రద్దీ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కారులో ఉన్న ఇద్దరికీ తృటిలో ప్రమాదం తప్పింది. కారు నుంచి క్షేమంగా బయటపడ్డారు. చెన్నై మెట్రో నీటి సరఫరా, మురుగునీటి బోర్డు, చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు స్పాట్కు చేరుకుని పరిశీలించారు.
Car topples in OMR Chennai after road caves in https://t.co/TWx4Zy017f
— Omjasvin M D (@omjasvinMD) October 8, 2026
వైట్ కలర్ SUV వెళుతుండగా, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పక్కన ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది. ఈ ఘటనలో కారు ముందు టైర్లలో ఒకటి గుంతలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత కారు బోల్తా పడి ఆ గొయ్యిలో పడింది. రోడ్డు కుంగిపోయిన కొన్ని నిమిషాల్లోనే కారులో ఉన్న ఇద్దరూ బయటకు వచ్చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ రూట్లో మెట్రో రైలు పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. గుంతను బారికేడ్లతో మూసివేయడంతో రోడ్డు మరింత ఇరుకుగా మారింది.
ఈ ప్రమాదం తర్వాత ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. ఇతర వాహనాలను దారి మళ్లించారు. మరమ్మతు పనులలో భాగంగా.. గుంతను పూడ్చే పని మొదలైంది. ఇంత నాసిరకంగా రోడ్డు పనులు చేసిన కాంట్రాకర్ట్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు కుంగిపోవంతో కారు గొయ్యిలో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గతేడాది మే నెలలో కూడా అదే ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు కూడా కారు గుంతలో పడిపోయింది. డ్రైవర్‌తో పాటు నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఎనిమిది అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. స్థానికులు కారులో ఉన్నవాళ్లందరినీ కాపాడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.