
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (RANABAALI). అక్టోబర్ 16న మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది.. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ సాలిడ్గా ఉంది. 1876-78 మధ్యకాలంలో సంభవించిన మహా కరువు నేపథ్యంలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న ఆకలి, దోపిడీ, బ్రిటిష్ పాలకుల అణచివేతను సినిమాలో బలంగా చూపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
‘రణబాలి’ కథ .. డైరెక్టర్ మాటల్లో..
చరిత్రలో కొన్ని ఘటనలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ కొన్ని విషాదాలు మాత్రం తరాలు మారినా వాటి ఆనవాళ్లను మిగుల్చుతూనే ఉంటాయి. అలాంటి భయానక అధ్యాయమే 1876-78 మధ్య దక్షిణ భారతాన్ని అతలాకుతలం చేసిన మద్రాస్ మహా కరవు. ఆకలి, పేదరికం, అంటు వ్యాధులతో ఆ కాలంలో ఎన్నో కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాయి. అదే చీకటి చరిత్రను కథా నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కిన చిత్రమే ‘రణబాలి’ (Ranabaali).
ఇక విజయ్ దేవరకొండను ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని రా అండ్ రగ్గడ్ లుక్‌లో చూపించారు. టైటిల్ పాత్రలో నటిస్తున్న విజయ్.. బ్రిటిష్ పాలనలో కరువు, ఆకలి, దోపిడీతో అల్లాడుతున్న ప్రజల కోసం పోరాడే ఓ వీరుడిగా కనిపించనున్నారు. బ్రిటిష్ అధికారులతో ఆయన చేసే పోరాటాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. మరోవైపు రష్మిక మందన్న జయమ్మ పాత్రలో నటిస్తోంది. ఆమె రణబాలి భార్యగా, అతడి పోరాటంలో భాగస్వామిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కథలో ఆమె పాత్ర కూడా కీలకంగా ఉండనుందని హింట్ ఇచ్చేసాడు డైరెక్టర్.
80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ఓ మహా విపత్తు..
ఈ మహాకరువులో 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ఓ మహా విపత్తు వెనుక.. లెక్కల్లో కనిపించని వేలాది కుటుంబాల కన్నీటి కథలున్నాయి. అందుకే ‘రణబాలి’ని కేవలం ఓ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా చూడలేం. ఓ విపత్తు మనిషి జీవితాన్ని ఎంతలా మార్చగలదు? అణచివేతను ఎదుర్కొంటున్న ప్రజల్లో తిరుగుబాటు ఆలోచన ఎలా పుడుతుంది? తమ నేల, తమ మనుషుల కోసం కొందరు ఎందుకు పోరాట బాట పడాల్సి వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలకు కథ రూపంలో సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ సినిమా.
మొత్తంగా భారీ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, బలమైన ఎమోషన్, రా యాక్షన్, బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే కథతో ‘రణబాలి’ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. అక్టోబర్ 16న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.