
హోమ్ లోన్, కారు లోన్ తీసుకోవాలని అనుకుంటున్న వారికి RBI పెద్ద షాక్ ఇచ్చింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత రెపో రేటును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు గాను ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో.. ఇది 5.50 శాతానికి చేరింది.
ఈ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం నేరుగా సామాన్యుల EMI చెల్లింపులపై పడనుంది. బ్యాంకులు ఈ భారాన్ని వినియోగదారులపైకి మళ్లిస్తే.. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్‌లు మరింత ఖరీదు కానున్నాయి. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేటు తీసుకున్న వారికి ప్రతి నెల చెల్లించే ఈఎంఐ మొత్తం పెరగడమో లేదా లోన్ గడువు పొడిగించడమో జరుగుతుంది.
ఈఎంఐలపై భారం ఎంత పడనుంది?
7.50 శాతం వడ్డీ రేటుతో 20 సంవత్సరాల కాలపరిమితి కలిగిన రుణాలు తీసుకున్నవారికి ఈ పెంపు ప్రభావం ఎలా ఉంటుందో కింది ఉదాహరణల ద్వారా స్పష్టమవుతుంది:
1. రూ. 20 లక్షల హోమ్ లోన్:
* ప్రస్తుతం చెల్లిస్తున్న ఈఎంఐ: సుమారు రూ. 16వేల 112
* వడ్డీ రేటు 7.75 శాతానికి పెరిగితే: రూ. 16వేల 419
* అదనపు భారం: నెలకు సుమారు రూ. 307 పెరుగుతుంది.
2. రూ. 30 లక్షల హోమ్ లోన్:
* ప్రస్తుతం చెల్లిస్తున్న ఈఎంఐ: సుమారు రూ. 24వేల168
* వడ్డీ రేటు 7.75 శాతానికి పెరిగితే: రూ. 24వేల 628
* అదనపు భారం: నెలకు సుమారు రూ. 460 పెరుగుతుంది.
3. రూ. 50 లక్షల హోమ్ లోన్:
* ప్రస్తుతం చెల్లిస్తున్న ఈఎంఐ: సుమారు రూ. 40వేల 280
* వడ్డీ రేటు 7.75 శాతానికి పెరిగితే: రూ. 41వేల 047
* అదనపు భారం: నెలకు సుమారు రూ. 767 అదనపు భారం పడుతుంది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం “వివేకవంతమైన చర్య” అని సీఎస్‌బీ బ్యాంక్ ఎండీ, సీఈఓ ప్రళయ్ మోండల్ అభివర్ణించారు. రాబోయే త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం పెరిగే ముప్పును ముందే గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.