Reading Time: < 1 minute
Vijay Deverakonda Trolls Ranabali Coordinated Social Media Attacks

Vijay Deverakonda: “నా మీద నాకున్న నమ్మకం వాళ్లకు బలుపుగా అనిపిస్తే నేనెందుకు తగ్గాలి? నా నిజాయతీ వాళ్లకు అహంకారంలా అనిపిస్తే నేనెందుకు నటించాలి?” అంటూ హీరో విజయ్ దేవరకొండ తనపై విషం చిమ్ముతున్న ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా తన సినిమాలను, తన వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న ప్రచారంపై విజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది సాధారణ ప్రేక్షకుల నుంచి వస్తున్న విమర్శ కాదని, పథకం ప్రకారం నడిపిస్తున్న వ్యవస్థీకృత దాడి అని ఆయన ఆరోపించారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యవహారాన్ని ఎండగడుతూ విజయ్ దేవరకొండ కీలక విషయాలు వెల్లడించారు. “ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది, అందులో తప్పు లేదు. కానీ కొందరు 50 ఫేక్ అకౌంట్లు పెట్టుకుని, ఒకేసారి ఒకే రకమైన రీల్‌ను షేర్ చేస్తున్నారు. తెలుగు సినిమా అయిన ‘రణబాలి’కి వెళ్లకుండా ఇతర సినిమాలకు వెళ్లండంటూ కావాలని పోస్టులు పెట్టిస్తున్నారు. ఎవరో వెనుక కూర్చొని డబ్బులు ఇచ్చి మరీ ఈ పనులు చేయిస్తున్నారు” అని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తనకు ఇండస్ట్రీ రాజకీయాలు అర్థం కావడానికి ఏడేళ్ల సమయం పట్టిందని విజయ్ అన్నారు. “గత ఏడాది నాకు ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది. సినిమాను ప్రమోట్ చేయడానికి డబ్బులు ఖర్చు పెడితే నలుగురు బాగుపడతారు. కానీ ఒకరిని తొక్కేయడానికి, కిందకు లాగడానికి ఇలాంటి నీచమైన టూల్స్‌ను వాడటం బాధాకరం. రేపు ఇదే పనిని ఏఐతో కూడా చేయిస్తారు” అని పేర్కొన్నారు. “నా సినీ ప్రయాణం వాళ్లకు అరగకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా? మారాల్సింది నేను కాదు.. వాళ్లే. బాగుపడాల్సింది కూడా వాళ్లే” అంటూ స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘రణబాలి’ అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.