
ICC World Cup 2027: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2027కు సంబంధించిన టికెట్ల వేటలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సృష్టించిన క్రేజ్ మామూలుగా లేదు. అక్టోబర్ 1, 2026న టికెట్ బ్యాలెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా పది లక్షలకు పైగా టికెట్ దరఖాస్తులు రాగా, అందులో అక్టోబర్ 10న జరగనున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసమే ఏకంగా లక్షకు పైగా అప్లికేషన్లు దాఖలయ్యాయి. మ్యాచ్‌కు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఇంత క్రేజ్ రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ 14వ ఎడిషన్ ప్రపంచకప్ టోర్నీ 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు జరగనుంది. ఇప్పటివరకు దాదాపు 3,20,000 మందికి పైగా అభిమానులు ఈ మూడు దేశాల్లో జరిగే రకరకాల మ్యాచ్‌ల టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీన్నిబట్టి ఈ మెగా టోర్నీపై అభిమానుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
డిమాండ్ విషయంలో ఇండియా-పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాతి స్థానాల్లోనూ టీమిండియా మ్యాచ్‌లే రాజ్యమేలుతున్నాయి. 86,000కు పైగా దరఖాస్తులతో సౌతాఫ్రికా-ఇండియా మ్యాచ్ రెండో స్థానంలో నిలవగా, 80,000కు పైగా అప్లికేషన్లతో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ మూడో స్థానంలో ఉంది. ఇవే కాకుండా మరో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కి కూడా ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. నవంబర్ 7న జరగబోయే ప్రీ-సీడెడ్ సూపర్ 7 రౌండ్‌లో ఇండియా (A1), పాకిస్థాన్ (A3) త్యాగయ్యే మ్యాచ్ కోసం దాదాపు 75,000 అప్లికేషన్లు వచ్చాయి. ఇక జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానంలో జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం దాదాపు 65,000 మంది అభిమానులు పోటీ పడుతున్నారు.
ఈ టోర్నీ టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. ప్రారంభ టికెట్ ధర 9.62 అమెరికన్ డాలర్లు (రూ. 158) కాగా, హై-టైర్ మ్యాచ్‌లకు గరిష్ట ధర 31.31 అమెరికన్ డాలర్లుగా (రూ. 514) నిర్ణయించారు. వీటికి తోడు ఫ్యామిలీ బండిల్స్, విద్యార్థులు, పెన్షనర్లకు ప్రత్యేక తగ్గింపులు, స్థానికులకు ముందస్తు కేటాయింపులతో పాటు కమ్యూనిటీ క్లబ్‌లు, పాఠశాల విద్యార్థుల బృందాల కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా సిద్ధం చేశారు. కేవలం 48 గంటల్లోనే దాదాపు పది లక్షలకు పైగా టికెట్ అప్లికేషన్లు రావడం ఈ ప్రపంచకప్‌కు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోందని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఐసీసీ మెగా పురుషుల టోర్నీ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి రావడం అక్కడ అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల నుంచి దాదాపు 2.5 బిలియన్ల క్రికెట్ ప్రేమికులను ఈ టోర్నీ ఆకట్టుకోనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.