
పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులకు భారీ ఊరట ప్రకటించింది జీఎస్టీ కౌన్సిల్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2026 అక్టోబర్ 8న న్యూఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పన్ను పరిపాలనను (ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్) మరింత సరళతరం చేసే దిశగా జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్టు అధికారాలను కౌన్సిల్ తొలగించింది. జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైన (2017) సమయంలో నకిలీ ఇన్‌వాయిస్‌లను అరికట్టడానికి సాంకేతిక పరిమితుల వల్ల అధికారులకు అరెస్ట్ అధికారాలు కల్పించారు. అయితే, ప్రస్తుతం డిజిటల్ డేటా, ఇన్‌వాయిస్ మ్యాచింగ్ వ్యవస్థ బలోపేతం కావడంతో పన్ను చెల్లింపుదారులపై విశ్వాసంతో కూడిన పారదర్శక విధానాన్ని అమలు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. అధికారుల వేధింపుల నుంచి నిజాయితీగల వ్యాపారులకు రక్షణ కల్పించడం దీని ముఖ్య లక్ష్యం అని చెప్పారు.
క్రిమినల్ ప్రాసిక్యూషన్ (చర్యలు) పరిమితిని రూ. 1 కోటి నుండి రూ. 5 కోట్లకు పెంచారు. అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ (కోర్టుల ద్వారా క్రిమినల్ చర్యలు) ప్రారంభించే కనీస పరిమితిని రూ. 1 కోటి నుండి రూ. 5 కోట్లకు పెంచారు. గతంలో రూ. లేటెస్టుగా చేసిన సవరణతో, వివాదం లేదా లోపం విలువ రూ. 5 కోట్ల కంటే తక్కువగా ఉంటే వారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరగదు. దీనివల్ల దేశంలోని చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలకు పెద్ద ఉపశమనం లభిస్తుంది.
సాధారణ జీఎస్టీ జరిమానాను రూ. 25 వేల నుంచి 10 వేల రూపాయలకు తగ్గించారు. అదేవిధంగా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద ఇన్పుట్ సేవలపై చెల్లించిన పన్నులకు కూడా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిఫండ్ సౌకర్యాన్ని విస్తరించారు. అంటే ఇన్పుట్స్, ముడి పదార్థాల ధరలు ఎక్కువగా ఉండి.. ఔట్ పుట్ ధరలు తక్కువగా ఉన్నపుడు ట్యాక్స్ రీఫండ్ చేయడం దీని ఉద్దేశం.
ఉద్యోగులకు యాజమాన్యాలు అందించే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఐటీసీ పొందేందుకు అనుమతించారు. ఇంతకుముందు జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 17(5)(b) ప్రకారం, యాజమాన్యాలు తమ ఉద్యోగుల కోసం కొనుగోలు చేసే గ్రూప్ హెల్త్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై 18% జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. ఏదైనా చట్టం ప్రకారం ఉద్యోగులకు ఇన్సూరెన్స్ అందించడం తప్పనిసరి అయితే తప్ప, సాధారణంగా ఈ 18% పన్నుపై ఐటీసీ (ITC) క్లెయిమ్ చేయడానికి కంపెనీలకు అనుమతి ఉండేది కాదు. దీనివల్ల కంపెనీలకు అదనపు ఆర్థిక భారం పడేది.
లేటెస్టుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, సంఘటిత రంగంలోని యాజమాన్యాలు తమ ఉద్యోగులకు అందించే బీమా ప్రీమియంలపై చెల్లించిన జీఎస్టీని ఐటీసీ రూపంలో తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు.