
ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్ పద్ధతులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్లకు ఖరీదైన బహుమతులు, ఫారెన్ ట్రిప్స్ ఆఫర్ చేస్తూ ప్రిస్క్రిప్షన్లను ప్రభావితం చేయటంపై దేశ అత్యున్నత ధర్మాసనం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీల అక్రమాలకు చెక్ పెట్టేందుకు చట్టబద్ధమైన నిబంధనలను రూపొందించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వైద్య వృత్తి పవిత్రతను దెబ్బతీసేలా ఫార్మా కంపెనీలు ఫాలో అవుతున్న అనైతిక మార్కెటింగ్ అండ్ సేల్స్ విధానాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్లకు ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోకపోవటాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.
ఉచితాల ఆఫర్ల వెనుక అసలు సమస్య?
ఫార్మా కంపెనీలు తమ మందులు విక్రయించుకోవడానికి డాక్టర్లకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, విదేశీ ట్రిప్పులు, ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇలాంటి బహుమతులు తీసుకునే డాక్టర్లపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు.. వాటిని ఆఫర్ చేస్తున్న ఫార్మా కంపెనీలపై మాత్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వొకేట్ సంజయ్ పరీక్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది చట్టపరమైన పెద్ద లోపమని, దీనివల్ల రోగుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వాదించారు. గతంలో ‘అపెక్స్ లేబొరేటరీస్’ కేసులోనూ డాక్టర్-రోగి సంబంధం పవిత్రమైనదని, ఫార్మా కంపెనీల ఉచితాలు ఈ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రభుత్వం, కోర్టు స్పందన ఏంటి?
ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘యూనిఫాం కోడ్ ఫర్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్’ (UCPMP 2024) సరైన అమలు యంత్రాంగం లేకుండా కేవలం స్వచ్ఛందంగానే మిగిలిపోతోందని కోర్టు గతంలోనే అనుమానం వ్యక్తం చేసింది. దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఫార్మా కంపెనీలపై చట్టపరమైన నియంత్రణ అవసరమా లేదా అనే అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తుందని కోర్టుకు తెలిపారు. ఈ కమిటీ 2 నెలల్లోగా తన నివేదికను సమర్పిస్తుందని.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున సమర్పించబోయే కంప్లైయన్స్ అఫిడవిట్‌ను పరిశీలించడానికి ఈ కేసును జనవరి 29కి ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటివరకు ప్రస్తుత మార్కెటింగ్ కోడ్ నిబంధనలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఏదేమైనా.. ఫార్మా కంపెనీల అనైతిక వ్యాపార విధానాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వైద్య రంగంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. సేల్స్ కోసం డాక్టర్లకు గిఫ్ట్స్, క్యాష్, వస్తువులు, టూర్ ప్యాకేజీలు లంచంగా ఇచ్చే కంపెనీలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.