
OTR: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు బీఆర్‌ఎస్ ఎందుకు దూరంగా ఉంది? అనుబంధ కార్మిక సంఘ నేతల నుంచి వత్తిడి వచ్చినా… పార్టీ పెద్దలు ఎందుకు కామ్‌గా ఉండమన్నారు? కనీసం పోటీలో ఉన్న ఏ యూనియన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించకపోవడానికి కారణాలేంటి? బీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం నేతలు లోపాయికారీగా ఏం చేస్తున్నారు? తమ స్టాండర్డ్ ఓటర్స్‌కు ఏం చెబుతున్నారు?.సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. జనరల్ ఎలక్షన్స్‌ని తలపించేలా నడుస్తున్న ఈ ప్రక్రియలో వివిధ రాజకీయ పార్టీలు ఆయా సంఘాలకు మద్దతిస్తున్నాయి. ఆయితే… గతంలో శత్రువులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మిత్రులు అవడంతో ఈ సారి ఎలక్షన్స్ రక్తి కడుతున్నాయి.
గతంలో ప్రత్యర్థులుగా పోటీ పడిన EU, TMU, NMU ఈసారి కూటమిగా ఏర్పడ్డాయి. అప్పుడు EU, TMUలో కీలక పాత్ర పోషించిన నేతలే తెలంగాణ వర్కర్స్ యూనియన్ SWF గా బరిలోకి దిగుతున్నారు. ఈ swf కు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు సిఐటియు అనుబంధ సంఘం మద్దతు తెలపడంతో ఆర్టీసీ ఎన్నికలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ వైఖరిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏ ఎన్నికలు వచ్చినా హడావుడి చేసే ఆ పార్టీ కీలకమైన ఆర్టీసీ ఎన్నికలతో అంటీ ముట్టనట్టుగా ఎందుకు ఉంటోందంటూ మాట్లాడుకుంటున్నారు నేతలు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు గౌరవాధ్యక్షుడిగా గుర్తింపు సంఘం ఎన్నికలను సీరియస్ గా తీసుకొని పనిచేసేవారు. అయితే ఈ సారి మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండడానికి బలమైన కారణమే ఉందని అంటున్నారు పార్టీ నాయకులు.
ముఖ్యంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఆర్టీసీలో యూనియన్స్‌ని రద్దు చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని ప్రకటించిన కేసీఆర్ ఇక యూనియన్ల అవసరం లేదని కూడా అప్పట్లో చెప్పారు. దీంతో అప్పటి నుంచి కార్మిక సంఘాలు లేకుండానే నడుస్తోంది టీజీఎస్ ఆర్టీసీ. ఇక ఎన్నికల ప్రస్తావనే లేదు. అలా తొమ్మిదేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్లీ గుర్తింపు సంఘం ఎన్నికలు రావడంతో డైలమాలో పడిపోయింది కారు పార్టీ. గులాబీ కార్మిక విభాగం నేతలు ఈసారి ఎలాగైనా పోటీ చేద్దామని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. కానీ… గతంలో తమ అధినేతే ఈ ఎన్నికలు, యూనియన్లు వద్దని స్వయంగా ప్రకటించడం… ఆర్టీసీ ఇప్పటివరకు ప్రభుత్వంలో విలీనం కాకపోవడంతో ఇవన్నీ వ్యతిరేక ప్రభావం చూపే ప్రమాదం ఉందని పెద్దలు అన్నట్టు తెలిసింది.
ఇలాంటి సమయంలో… కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ యూనియన్లను ఏర్పాటు చేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుపుతుండడంతో పోటీ చేస్తే తేడా పడుతుందని కార్మిక నేతలకు అధిష్టానం సర్ది చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతానికైతే… ఈ గుర్తింపు సంఘం ఎన్నికలకు దూరంగా ఉండండి అని కార్మిక నేతలకు సూచించారన్నది తెలంగాణ భవన్ టాక్. అయితే… లోపాయికారీగా… బీఆర్ఎస్‌కు సానుభూతి పరులుగా ఉండే ఆర్టీసీ ఓటర్లంతా అధికార పార్టీ గుర్తింపు సంఘానికి వ్యతిరేకంగా ఓటేయమని చెబుతున్నట్టు తెలుస్తోంది. బహిరంగంగా బీఆర్ఎస్ ఏ సంఘానికి మద్దతు ప్రకటించకున్నా… ఇంటర్నల్‌గా BRS కార్మిక విభాగం నేతలు ఈ విషయాన్ని చెబుతున్నారట. ప్రస్తుతానికి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ భవిష్యత్తులో ఆలోచిస్తామంటున్నారు గులాబీ కార్మిక విభాగం నేతలు.