
OTR: ఆ నియోజకవర్గంలో రాజకీయ నేతలు కామధేనువు, కల్పతరువు కలిసి ఒకేసారి దొరికినట్టు ఫీలవుతున్నారా? మండలం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు… ప్రతి ఒక్కరూ భూమి నుంచి ఎంతోకొంత పిండుకుంటున్నారా? ఎకరాల చొప్పున లెక్కలు కట్టి వాటాలు వసూలు చేసుకుంటున్నారా? బయట ఎంత కొట్టుకున్నా… అక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఒక్కటవుతున్నారా? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏంటా దందా?. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం… అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. ఓవరాల్‌గా మూడు రాష్ట్రాల బోర్డర్ ఉన్న ఏరియా. అయినా… బతుకుదెరువు లేక వలసలకు కేరాఫ్‌గా చెప్పుకునే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు భూ మంతర్ నడుస్తోందట. గత పదేళ్ల నుంచి ఇక్కడ ఫామ్ ల్యాండ్ దందా మొదలైందని అంటున్నారు. నారాయణ్‌ఖేడ్‌లో ఎటు చూసినా విచ్చలవిడిగా ఫామ్ ల్యాండ్ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. ఆదివారం వస్తే చాలు వందల కార్లలో వేలాది మంది కస్టమర్లను ఇక్కడకి తీసుకువచ్చి అర చేతిలో స్వర్గం చూపించేస్తున్నాయి రియలెస్టేట్ కంపెనీలు. అక్రమ వెంచర్స్ యజమానులు కొందరైతే… మినీ ఊటీలా ఉంటుందని, ఐ ఫోన్ కొనే డబ్బుతో ఇక్కడ ఫ్యాం ల్యాండ్ కొనేయవచ్చంటూ నమ్మించి, ముగ్గులోకి దించి జనాన్ని నట్టేటముంచుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
పదేళ్ల క్రితం నారాయణఖేడ్‌లో ఎకరం భూమి 5 లక్షల రూపాయలంటే బాగా ఎక్కువన్నట్టు. కానీ… ఫామ్ ల్యాండ్ దందా మొదలయ్యాక రేట్లు పదింతలు పెరిగాయి. అందుకు తగ్గట్టే ఇక్కడ దళారీ వ్యవస్థ కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఆ దళారులతో స్థానిక కాంగ్రెస్, బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి నాయకులు చేతులు కలిపి కొత్త దందా మొదలుపెట్టారట. వెంచర్ వేసే యజమానులతో ముందుగానే సమావేశమై… మా పార్టీలు వేరైనా పైసల విషయంలో మేమంతా ఒక్కటేనని సిగ్గులేకుండా బేరాలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా బావగానీ…. వంగతోట కాదన్నది సామెత. కానీ… ఇక్కడ మాత్రం పూర్తి రివర్స్‌లో ఉందట వ్యవహారం. మేం ఎక్కడైనా కొట్టుకుంటాంగానీ… ఫామ్‌ల్యాండ్ దగ్గర పంపకాల్లో మాత్రం అందరంఒక్కటే, సిగ్గు ఎగ్గు ఉండదంటూ… కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు కలిసి కోరస్ పాడటమే విడ్డూరం అంటున్నారు పరిశీలకులు. 2018 తర్వాత నారాయణఖేడ్‌లోరియల్ బూమ్ విపరీతంగా పెరిగింది. అప్పడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, లోకల్ ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ నేతే ఉండటంతో….లోకల్ గులాబీ నేతలకు ఫామ్ ల్యాండ్స్ కల్పతరువులా మారాయని అంటున్నారు.
మరి… అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులేమన్నా తక్కువ తిన్నారా అంటే… అది కూడా లేదట. అపోజిషన్‌గా వాళ్ళ స్థాయిలో వాళ్లు రెండు చేతులతో జేబులు నింపుకున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులతో చేయి కలిపి వెంచర్ల యజమానులను బెదిరించి మామూళ్లు వసూలు చేశారన్నది స్థానికంగా చెప్పుకుంటున్న మాట. అదేంటని ప్రశ్నిస్తే రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ ఆపేయడంతో ఇక ఎంతో కొంత సమర్పించుకోత తప్పని పరిస్థితి ఉండేదట. ఇక 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు తమ పైసల ఆకలి తీర్చుకోవడానికి ఈ వెంచర్లపైనే పడ్డారని అంటున్నారు. తమ నాయకుల పేర్లు చెప్పి బ్యాగుల్లో భారీగానే వేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ మాముళ్లు లోకల్ లీడర్ల వరకే అనుకుంటే పొరపాటే. నియోజకవర్గ బడా నేతలకు సైతం వసూళ్లలో వాటాలు వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పైగా ఇక్కడ కొన్ని ప్రోటోకాల్స్ కూడా ఉంటాయంటున్నారు. ఎవరైనా వెంచర్ వేయాలంటే మొదట నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలకు చెందిన నేతలను కలవాలట.
అధికారంలో ఎవరుంటే వాళ్ళకు ఎకరానికి 2 నుంచి 3 లక్షల రూపాయల్ని ఫామ్ ల్యాండ్ వెంచర్ యజమానులు సమర్పించుకోవాలంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతకు ఎకరానికి లక్ష వరకు ఇచ్చుకోవాలట. ఇలా ఎన్ని ఎకరాల భూమి కొనుగోలు చేస్తే అంత లెక్కన మూటకట్టి అప్పజెప్పాల్సిందేనంటున్నారు. లేదంటే… ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయవద్దని రెవెన్యూ అధికారుల మీద వత్తిడి తెస్తారట. ప్రజా ప్రతినిధులతో పాటు రెవెన్యూ అధికారులు, పోలీసులు కూడా ఫామ్ ల్యాండ్ వెంచర్స్‌తో గట్టిగానే వెనకేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే… భూమిని చదును చేసి వెంచర్ లా మార్చి ప్లాట్లు అమ్మితే… తమకు వచ్చే లాభంలో ఎక్కువ శాతం ఈ మామూళ్ళకే పోతోందని రియలెస్టేట్ కంపెనీల యజమానులు వాపోతున్నట్టు తెలుస్తోంది. ఈ వాటాల పోటు తట్టుకోలేక ఇక్కడి నుంచి జెండా ఎత్తేసిన కంపెనీలు కూడా ఉన్నాయట. చిన్న స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గంలో పేరు మోసిన నేత వరకు… ప్రతి ఒక్కరూ వదలకుండా పైసల కోసం పీక్కుతింటున్నారన్నది కంపెనీల ప్రతినిధుల అభియోగం. మొత్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు నారాయణ్‌ఖేడ్ ఫాం వెంచర్స్ ఏటీఎంలా మారాయన్నది లోకల్ టాక్. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న రెవెన్యూ అధికారుల్ని, అలాగే ఎకరాకు లెక్కకడుతూ మామూళ్లు దండుకుంటున్న ప్రజాప్రతినిధులకు అడ్డుకట్ట వేయాలంటున్నారు వెంచర్ వోనర్స్.