
ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే యెమెన్ స్వాధీనం దిశగా సాగుతుండగా.. ఈ దూకుడు ఇప్పుడు సౌదీ వరకు సాగుతోంది. గత కొద్ది రోజులుగా హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. తాజాగా మరోసారి సౌదీలోని రియాద్ విమానాశ్రయంపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 36 మందికి గాయాలయ్యాయి.
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణి దాడి చేసినట్లు ప్రకటించారు. విమానాశ్రయ ప్రాంతం నుంచి దట్టమైన పొగ పైకి ఎగసిపడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో సూడాన్‌కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో సౌదీ పౌరులతో పాటు ఇతర దేశాలకు చెందినవారూ ఉన్నారు. అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన మరో దాడిలో మొరాకో, అల్జీరియా దేశాలకు చెందిన ఇద్దరు మహిళలు మరణించారు. ఈ ఘటనలో మరో 28 మంది గాయపడినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు.
రియాద్‌కు ఉత్తర దిశగా వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ రక్షణ బలగాలు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. రాజధానిపై దాడులకు ఉపయోగించిన ప్రయోగ వేదికను యెమెన్ రాజధాని సనా ప్రాంతంలో ధ్వంసం చేసినట్లు సౌదీ బలగాలు పేర్కొన్నాయి. హౌతీ లక్ష్యాలపై సౌదీ నేతృత్వంలోని బలగాలు ప్రతిదాడులు చేపట్టిన నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలతో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
సౌదీ అరేబియా గగనతలం మీదుగా విమానాలు నడపవద్దని అంతర్జాతీయ విమానయాన సంస్థలను హౌతీలు హెచ్చరించినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే మక్కా, మదీనా పరిసర ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు సౌదీ అరేబియాలోని అమెరికా దౌత్య కార్యాలయం భద్రతా హెచ్చరిక జారీ చేసింది. క్షిపణులు, డ్రోన్లతో మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రియాద్, అభా విమానాశ్రయాలపై దాడులు, సౌదీ బలగాల ప్రతిచర్యలతో యెమెన్‌లో కొనసాగుతున్న ఘర్షణలు మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది.