
- సిటీపై అంతర్జాతీయ సంస్థల ఆసక్తి
- ఇక్కడ ప్రకృతి విపత్తు ముప్పు చాలా తక్కువ
- ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెట్టుబడుల వరద
- ఇప్పటికే ఇరవై ఐదుకుపైగా కేంద్రాల ఏర్పాటు
- ప్రభుత్వానికి సవాలుగా వసతుల కల్పన
- సోలార్ పవర్, ఎస్టీపీ వాటర్‌పై సర్కారు దృష్టి
- ఇందుకు ఒప్పుకుంటేనే కొత్త వాటికి అనుమతి!
హైదరాబాద్, వెలుగు: ప్రపంచస్థాయి డేటా సెంటర్లకు హైదరాబాద్ కేరాఫ్‌గా మారుతున్నది. సిస్మిక్ జోన్-2 పరిధిలో భూకంపాల ముప్పు లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం అత్యల్పంగా ఉండడం సిటీకి అనుకూలతలు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలు, సింగిల్ విండో అనుమతులు ఈ రంగంలో విదేశీ పెట్టుబడులకు ఊతమిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 25 వరకు చిన్న, పెద్ద డేటా సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. మరో డజనుకు పైగా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.
అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అదానీ కనెక్స్, ఎన్‌టీటీ వంటి దిగ్గజ బహుళజాతి కంపెనీలు శంషాబాద్, మహేశ్వరం, చందన్‌వెల్లి, ఫార్మా సిటీ క్లస్టర్లలో భారీ మౌలిక వసతుల కోసం బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులను కుమ్మరిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ వాడకం విపరీతంగా పెరగడంతో హైదరాబాద్ డేటా నిల్వ సామర్థ్యం మెగావాట్ల స్థాయి నుంచి గిగావాట్ స్థాయికి దూసుకుపోతోంది. ఈ డేటా సెంటర్లకు విదేశాల నుంచి భారీగా వచ్చేపెట్టుబడులు, స్థానికంగా పెరిగే ఉపాధి అవకాశాలు నాణేనికి ఒక వైపు కాగా, మరోవైపు వీటి నిర్వహణకు అవసవరమయ్యే భారీ విద్యుత్, నీరు, ఇతర మౌలిక వసతులను కల్పించడం రాష్ట్ర సర్కారుకు కత్తి మీద సాములా మారుతున్నది.
విద్యుత్ గ్రిడ్‌పై ఇప్పటికే పడుతున్న లోడ్, భారీ నీటి వినియోగంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సింగపూర్, ఐర్లాండ్ లాంటి దేశాలు గ్రిడ్ స్థిరత్వం, పర్యావరణహితం కోసం డేటా సెంటర్ల విస్తరణపై పరిమితులు విధించడంతో రాష్ట్రంలోనూ అంతర్జాతీయ ‘పవర్ యూసేజ్ ఎఫెక్టివ్‌నెస్’, ‘వాటర్ యూసేజ్ ఎఫెక్టివ్‌నెస్’ ప్రమాణాలను నిర్బంధం చేయాలని నిపుణలు సూచిస్తున్నారు.
పవర్ గ్రిడ్‌పై లోడ్
డేటా సెంటర్లు రోజుకు 24 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. క్లౌడ్ సర్వర్లు ఒక్క సెకను కూడా ఆగకుండా నడిచేందుకు వందల మెగావాట్ల హై-వోల్టేజ్ నిరంతర విద్యుత్ అవసరమవుతుంది. ప్రస్తుతం ఏర్పాటవుతున్న హైపర్‌స్కేల్ క్యాంపస్‌ల వల్ల రాష్ట్ర డిస్కంలపై ఒత్తిడి పెరుగుతున్నది. ఒక్కో కేంద్రానికి 220 కేవీ, 400 కేవీ స్థాయి ప్రత్యేక సబ్‌స్టేషన్లతో పాటు బ్యాకప్ వ్యవస్థలను సమకూర్చడం ప్రభుత్వానికి సవాల్‌గా మారుతున్నది. థర్మల్ విద్యుత్‌పైనే ఆధారపడితే భారీగా కార్బన్ ఉద్గారాలు పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళన నెలకొన్నది. కొత్తగా ఏర్పాటవుతున్న డేటా సెంటర్లకు ప్రభుత్వం ప్రత్యేక ఆంక్షలు విధించనున్నది. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌ను సంప్రదాయ వనరుల నుంచి కాకుండా సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నుంచే ‘ఓపెన్ యాక్సెస్’ పద్ధతిలో సేకరించాలనే షరతులు పెడుతున్నది. గ్రీన్ ఎనర్జీని విధిగా వాడడం ద్వారా గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటు కాలుష్య రహిత డిజిటల్ ప్రగతి సాధించవచ్చని భావిస్తున్నది.
ప్రత్యామ్నాయంగా ఎస్టీపీ శుద్ధి నీరు..
డేటా సెంటర్లలో నిరంతరం ప్రాసెసింగ్ చేసే వేలాది హై-ఎండ్ సర్వర్ ర్యాక్‌లు విపరీతమైన ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తాయి. ఈ యంత్రాలు కాలిపోకుండా చల్లబరచడానికి వాడే చిల్లర్ ప్లాంట్లు, ఇవాపరేటివ్ కూలింగ్ టవర్ల కోసం ప్రతిరోజూ కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఎల్‌నినో పరిస్థితులు, లేదంటే వేసవి కాలంలో హైదరాబాద్ సిటీలో ఇప్పటికే తాగునీటి ఎద్దడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామిక అవసరాల కోసం భూగర్భ జలాలను లేదా ప్రాజెక్టుల నుంచి నీళ్లను మళ్లిస్తే అది ప్రజల మనుగడకే ముప్పుగా మారుతుందని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మంచినీటికి బదులు మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి వచ్చే రీసైకిల్డ్ వాటర్‌ను పరిశ్రమలకు అనుసంధానించాలని ఇప్పటికే నిర్ణయించింది. జలమండలి పరిధిలోని ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన సెకండరీ, టెర్షియరీ వాటర్‌ను పైప్‌లైన్ల ద్వారా ఈ డేటా సెంటర్ల కూలింగ్ కోసం తరలించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది.
ఉపాధి అవకాశాలు తక్కువే!
రాష్ట్రానికి రూ.వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, డేటా సెంటర్ల ద్వారా లభించే ప్రత్యక్ష ఉద్యోగాలు మాత్రం వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలోనే ఉంటున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ దశలో సివిల్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టు కార్మికులకు కొంతవరకు తాత్కాలిక ఉపాధి లభిస్తున్నప్పటికీ.. నిర్మాణం పూర్తయ్యాక కార్యకలాపాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, రిమోట్ క్లౌడ్ ఆటోమేషన్ ద్వారానే సాగుతాయి. వందలాది ఎకరాల విస్తీర్ణంలో రూ. వేల కోట్లతో నిర్మించే ఒక్కో హైపర్‌స్కేల్ కేంద్రంలో నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్లు, మెయింటెనెన్స్ ఇంజినీర్లు, సెక్యూరిటీ సిబ్బంది కలిపి కేవలం 100 నుంచి 200 మందికి మాత్రమే శాశ్వత ఉద్యోగాలు దక్కుతాయి.
సంప్రదాయ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ల మాదిరిగా ఇక్కడ వేలాది మందికి డెస్క్ కొలువులు దక్కవన్నది కాదనలేని వాస్తవంగా మారింది. అయినప్పటికీ, హైదరాబాద్‌లో డేటా బ్యాంకులు ఉండడం వల్ల అంతర్జాతీయ టెక్ దిగ్గజాల విశ్వసనీయత పెరగడంతో పాటు క్లౌడ్ స్టార్టప్‌లు, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ విభాగాలు పరోక్షంగా పుంజుకుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాబోయే రోజుల్లో 100% గ్రీన్ ఎనర్జీ, జీరో-లిక్విడ్ డిశ్చార్జ్ సాంకేతికతలతో కూడిన ‘గ్రీన్ డేటా సెంటర్’ విధానాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయగలిగితేనే డేటా సెంటర్ల వల్ల మేలు ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.