Reading Time: 2 minutes
Mythri Ravi Defends Vijay Deverakonda Ranabali Negativity

Mythri Ravi: “విజయ్ దేవరకొండ చాలా మంచి వ్యక్తి. ఎవరి జోలికీ వెళ్లడు.. ఎవరి గురించీ మాట్లాడడు. తన పని, తన సినిమాలు తప్ప అతనికి మరో ప్రపంచమే తెలియదు. అలాంటి వ్యక్తిపై సోషల్ మీడియాలో కావాలని పనిగట్టుకుని విషం చిమ్ముతుంటే చాలా బాధేస్తోంది” అంటూ ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వ్యక్తిత్వాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తిగా నెటిజన్లకు, ట్రోలర్లకు ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు ఆయన. “గత ఏడెనిమిదేళ్లుగా మేము విజయ్‌తో ట్రావెల్ అవుతున్నాం. అతను ఎంత మంచోడో, ఎంత సాఫ్ట్‌గా ఉంటాడో మాకు బాగా తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే.. అతను ఏం చేసినా సరే కావాలనే ఒక పద్ధతి ప్రకారం నెగెటివ్ ప్రచారం మొదలుపెడుతున్నారు. అసలు ఎందుకు మీకీ పిచ్చి పనులు? అతనిపై మీ మనసులో ఏమైనా నెగెటివ్ ఫీలింగ్స్ ఉంటే దయచేసి వాటన్నింటినీ తీసేయండి. పాజిటివ్ ఆలోచనతో అతన్ని చూడండి” అని కోరారు.

కనీసం ట్రైలర్, సినిమా రాకముందే నెగెటివిటీని స్ప్రెడ్ చేయడంపై రవిశంకర్ సూటిగానే ప్రశ్నించారు. “సినిమా చూశాక నచ్చకపోతే మీ అభిప్రాయం చెప్పండి, తప్పులేదు. కానీ ఏమీ చూడకుండానే.. ఇది బ్రిటిష్ కాలం నాటి కథంట, ఇలాంటివి ఇప్పుడు ఆడతాయా అంటూ పోస్టులు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఒక సినిమా కోసం ఒక నటుడు ఎంత శ్రమపడతాడో ఎవరైనా ఆలోచిస్తున్నారా? దయచేసి ఆ విష ప్రచారాన్ని పక్కనపెట్టి, అతను పెట్టిన ఎఫర్ట్‌ను గుర్తించి మెచ్చుకోండి” అంటూ హితవు పలికారు. ‘రణబాలి’ కోసం విజయ్ దేవరకొండ పడిన కష్టాన్ని రవిశంకర్ ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఈ కథ కోసం దాదాపు 100 రోజుల పాటు గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని, రాయలసీమ యాస, బాడీ లాంగ్వేజ్ కోసం పూర్తిస్థాయిలో మారిపోయారని చెప్పారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ రెండేళ్లపాటు ఆఫీస్‌కే పరిమితమై ఎంతో రీసెర్చ్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుత ప్రపంచం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 16న థియేటర్లలోకి వస్తున్న ‘రణబాలి’ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఎలాంటి నెగిటివిటీ లేకుండా, స్వచ్ఛమైన మనసుతో చూడాలని.. కచ్చితంగా ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని నిర్మాత రవిశంకర్ విజ్ఞప్తి చేశారు.