
IPL 2027 vs PSL 2027 Schedule: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 12వ సీజన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 2027 మార్చి 18 నుంచి మే 2 వరకు టోర్నీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1న లండన్‌లో జరిగిన పీఎస్ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఎనిమిది ఫ్రాంచైజీల యజమానులు, ప్రతినిధులతో చర్చించిన అనంతరం షెడ్యూల్ ఖరారు చేసింది. 2026లో ఎనిమిది జట్లకు విస్తరించిన లీగ్.. వరుసగా రెండో ఏడాది కూడా అదే ఫార్మాట్‌లో జరగనుంది.
గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న పెషావర్ జల్మీ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. మే 3న గడ్డాఫీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కొత్తగా లీగ్‌లోకి వచ్చిన హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి పెషావర్ విజేతగా నిలిచింది. 2026 సీజన్‌లో ఎనిమిది జట్లు పోటీపడగా.. హైదరాబాద్ కింగ్స్‌మెన్, రావల్పిండిజ్ కొత్త ఫ్రాంచైజీలుగా చేరాయి. అంతేకాకుండా ఆటగాళ్ల ఎంపికలో గతంలో ఉన్న డ్రాఫ్ట్ విధానానికి బదులుగా వేలం పద్ధతిని ప్రవేశపెట్టారు.
పీఎస్ఎల్ 2026 సీజన్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించిందని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు స్టేడియాలకు రావడంతో పాటు ప్రసారాలకూ విశేష ఆదరణ లభించిందని తెలిపారు. పీఎస్ఎల్ 12వ సీజన్‌ను మరింత ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఎనిమిది ఫ్రాంచైజీలు మరోసారి టైటిల్ కోసం పోటీపడనున్నాయని పేర్కొన్నారు. గత సీజన్‌లో గడ్డాఫీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌కు 32,461 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇది టోర్నీ చరిత్రలో రికార్డు స్థాయి ప్రేక్షకుల హాజరు. ఈ విజయాన్ని కొనసాగిస్తూ 2027 సీజన్‌లోనూ మరింత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, మెరుగైన ప్రసార అనుభవాన్ని అందించాలని పీసీబీ లక్ష్యంగా పెట్టుకుంది.
పీఎస్ఎల్ 2027 కోసం ఫ్రాంచైజీలు తమ జట్లను సిద్ధం చేసుకునే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆటగాళ్లను నేరుగా ఒప్పందం చేసుకోవడం, పాత జట్ల నుంచి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం, ట్రేడ్ విండో, ఆటగాళ్ల వేలం వంటి దశలు జరగనున్నాయి. 2026లో ప్రవేశపెట్టిన రెండేళ్ల కాంట్రాక్టుల విధానం ప్రకారం.. ఫ్రాంచైజీలు తమ గత సీజన్ జట్టు నుంచి గరిష్ఠంగా ఏడుగురు ఆటగాళ్లను కొనసాగించవచ్చు. ప్రతి జట్టులో 16 నుంచి 20 మంది ఆటగాళ్లు ఉండాలి. ఇందులో కనీసం ఇద్దరు అన్‌క్యాప్డ్ అండర్-23 ఆటగాళ్లు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా ప్రతి మ్యాచ్‌లో ఆడే తుది జట్టులో కనీసం ఒక అండర్-23 ఆటగాడికి అవకాశం కల్పించాలి. ఈ నిబంధనల నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి.
పీఎస్ఎల్ 2027లో ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్, రావల్పిండిజ్ జట్లు పోటీపడనున్నాయి. అయితే మార్చి నుంచి మే వరకు టోర్నీ జరగనుండటంతో విదేశీ ఆటగాళ్ల లభ్యత ఫ్రాంచైజీలకు సవాలుగా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా జరగనుండటంతో.. కొన్ని దేశాల ఆటగాళ్లకు షెడ్యూల్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్ ఆడేందుకే ఆసక్తి చూపుతారు. దాంతో పీఎస్ఎల్‌కు షాక్ తగలనుంది. దేశీ ఆటగాళ్లను విడుదల చేసేందుకు ఆయా దేశాల క్రికెట్ బోర్డుల అనుమతి కూడా అవసరం కావచ్చు.
ప్రతి ఫ్రాంచైజీ సాధారణ వేలం ప్రక్రియకు ముందు ఒక విదేశీ ఆటగాడితో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే ఆ ఆటగాడు గత పీఎస్ఎల్ సీజన్‌లో ఆడి ఉండకూడదు. ప్రతి జట్టు పూర్తి స్క్వాడ్‌లో ఐదు నుంచి ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు. తుది జట్టులో మాత్రం ముగ్గురు నుంచి నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. బ్రిటిష్ పౌరసత్వం పొందిన పేసర్ మహమ్మద్ అమీర్ విషయంలో రావల్పిండిజ్ జట్టుకు కొత్త సమీకరణాలు ఎదురయ్యే అవకాశం ఉంది. 2027 సీజన్‌లో ఆయన విదేశీ ఆటగాడిగా ఆడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే జట్టు విదేశీ ఆటగాళ్ల ఎంపికపై ప్రభావం పడవచ్చు.