Reading Time: < 1 minute

17 ఏళ్ల టీనేజర్.. 16 వేలకు Audi కారు రెంట్కు తీసుకుని చేసిన పనికి ఒక నిండు ప్రాణం పోయింది !

Caption of Image.

ఢిల్లీలో ఘోరం జరిగింది. 17 ఏళ్ల టీనేజర్ అత్యుత్సాహం 45 ఏళ్ల మనిషి నిండు ప్రాణం తీసింది. మూడు వాహనాలను నాశనం చేసింది. పిల్లల పెంపకం విషయంలో కొందరు తల్లిదండ్రుల అశ్రద్ధ ఇతరులకు ఎలా శాపంగా మారుతుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

ఢిల్లీలో తన ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయడానికి.. 17 ఏళ్ల బాలుడు ఒక యాప్లో రాత్రికి రాత్రే ఆడీ కారు రెంట్కు తీసుకున్నాడు. రూ. 16,000 చెల్లించి ఈ ఆడీ కారును అద్దెకు తీసుకున్నాడు. ఇంకేముంది.. వచ్చీరాని డ్రైవింగ్తో అర్ధరాత్రి రోడ్లపై ఈ టీనేజర్లు నానా రచ్చ చేశారు.

కారును రెంట్కు తీసుకున్న సదరు టీనేజర్ ఆడీ కారును అతి వేగంగా నడిపి మూడు వాహనాలను ఢీ కొట్టాడు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న 45 ఏళ్ల వ్యక్తిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సదరు పాదచారి తీవ్ర గాయాలతో చనిపోయాడు. పోలీసులు ఈ టీనేజ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ఆడీ కారును సీజ్ చేశారు. మైనర్‌కు కారును అద్దెకు ఇచ్చిన కంపెనీ పాత్ర పైనా దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన బాధితుడిని ఉమాశంకర్‌గా గుర్తించారు. మైనర్‌ను వర్చువల్గా జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.

కారును బుక్ చేయడం, వయస్సును ధృవీకరించడం, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం, వాహనాన్ని అప్పగించడం వంటి మొత్తం ప్రక్రియకు సంబంధించి అధికారులు కంపెనీ నుంచి సమాచారాన్ని కోరుతున్నారు. మైనర్‌కు కారును అప్పగించే ముందు అవసరమైన ధృవీకరణ జరగలేదని లేదా నిబంధనలను ఉల్లంఘించారని విచారణలో తేలితే.. అద్దెకు ఇచ్చిన కంపెనీపై చర్య తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.