Reading Time: 3 minutes
Off The Record On Chandrababu Master Plan

రెండు వేల కోట్ల రూపాయలు. ఎస్‌…. నెలకు రెండు వేల కోట్ల రూపాయలు. నో కాంప్రమైజ్‌….. టార్గెట్‌ చేరుకుని తీరాల్సిందే. ఏపీ సీఎం చంద్రబాబు నోటి వెంట వచ్చిన ఈ మాటలు ప్రస్తుతం కొన్ని వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. అసలేంటా నెలకు రెండువేల కోట్ల మేటర్‌? ఎవరికి టార్గెట్‌ పెట్టారు ఏపీ సీఎం? దాని వెనకున్న ఆయన లెక్కలేంటి?

అమరావతి…… కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయాల్ని కీలక మలుపు తిప్పే బలమైన అంశం కూడా. అందుకే సీఎం చంద్రబాబు దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో కేవలం మౌలిక వసతులు కల్పించి వదిలేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి స్థాయి కేపిటల్‌ సిటీగా తీర్చి దిద్దాలనుకుంటోంది కూటమి ప్రభుత్వం. 2014- 19 మధ్య క్షేత్ర స్థాయిలో ల్యాండ్ పూలింగ్ పూర్తిచేసి… కొన్ని భవనాలను మాత్రమే నిర్మించగలిగారు. దీనికి తోడు అప్పట్లో ప్రజా ప్రతినిధులంతా… గ్రౌండ్‌ రియాలిటీతో సంబంధం లేకుండా… రేపో, మాపో, అమరావతి పూర్తయిపోతుందంటూ ఊదరగొట్టేశారు. వాస్తవానికి అప్పుడు కూడా పనులు బాగానే జరిగాయి. కానీ… భూమికి ఐదు నుంచి పది అడుగుల లోతు నుంచి చేసుకుని రావాల్సిన పనుల వల్ల ఎంత పని జరిగిందో పైకి కనిపించలేదు.

అదే సమయంలో… ఇంకేముంది… అంతా అయిపోయిందంటూ ప్రజా ప్రతినిధులు జనాన్ని నమ్మించేందుకు చేసిన ప్రయత్నం వికటించింది. అయిపోతే చెప్పండి, ఏదీ ఎక్కడని ప్రశ్నించిన వాళ్ళకు పునాదుల్ని చూపించి సమాధానం చెప్పలేకపోయారు. ఆ ప్రభావంతో… 2019 ఎన్నికల సమయానికి నాటి టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఏం చేయలేదన్న భావన బలపడింది. అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం చివరకు అమరావతి పరిధి ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను కూడా కోల్పోవాల్సి వచ్చిందని అంటారు పరిశీలకులు.

ఆ అనుభవాలన్నిటినీ దృష్టిలో ఉంచుకునే… ఈసారి మాత్రం ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందట. 2024లో ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి రాజధాని పనుల్లో వేగం పెరిగింది. అయితే… ఇప్పటికే సగం పాలనా కాలం పూర్తయింది. ఈ టైంలో గతంలో సగంలో నిలిపివేసిన భవనాల్ని పూర్తి చేయడం, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ఇక మిగిలిఉన్న దాదాపు రెండున్నరేళ్ళలో ప్రధానమైన నిర్మాణాలన్నిటినీ పూర్తి చేసి చూపించాలన్న పట్టుదలతో ఉన్నారట ప్రభుత్వ పెద్దలు. అందులో భాగంగానే… సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణంలో నెలవారీ టార్గెట్స్‌ పెట్టినట్టు తెలిసింది. ఓవరాల్‌గా కనీసం నెలకు రెండు వేల కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తవ్వాలని నిర్దేశించారట ఆయన. దాంతో… అంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనా అన్న చర్చలు నడుస్తున్నాయి వివిధ వర్గాల్లో. అయితే… ఆయనేం ఆషామాషీగా ఆ టార్గెట్‌ పెట్టలేదని, దాని వెనక రాజధాని నిర్మాణం, అభివృద్ధితో పాటు…. రాజకీయ వ్యూహం కూడా ఉందని అంటున్నారు కొందరు. నిధుల వినియోగం పెంచడం, నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి లక్ష్యాల ద్వారా అమరావతిని ఆన్‌టైమ్‌ ట్రాక్‌ ఎక్కించడంతో పాటు రాబోయే రోజుల్లో టిడిపి లక్ష్యాలను కూడా చేరుకునేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట సీఎం. వచ్చే ఎన్నికల నాటికి అమరావతికి ఒక రూపు రావాలంటే… దాదాపు 50 వేల కోట్ల రూపాయల పనులు జరగాల్సి ఉంది. అదీకూడా… 2029 ప్రధమార్ధంలోనే టార్గెట్‌ రీచ్‌ అవ్వాలి. ఒక్కసారి ఎన్నికల నగారా మోగితే అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరు. అలాగే… బిల్లుల చెల్లింపులాంటి రకరకాల కారణాలతో జరగాల్సిన పనులన్నీ పెండింగ్‌లో పడిపోతుంటాయి.

అందుకే 2029 మార్చిలోపు అమరావతి నరగానికి ఒక రూపు రావాలి. అందుకోసం కాస్త అటు ఇటుగా ప్రభుత్వానికి ఇక 25 నెలల సమయం అయితే పక్కాగా చేతిలో ఉంది. అయితే… ఇక్కడే అసలు లెక్క మొదలవుతోంది. రాజధానిలో పూర్తి చేయాల్సిన నిర్మాణాలు చాలానే ఉన్నాయి. రహదారులు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, ఇతర మౌలిక వసతులతోపాటు ప్రభుత్వ భవనాల నిర్మాణాలు కూడా కీలకంగా ఉన్నాయి. వీటన్నిటినీ పూర్తి చేసి ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులంతా అమరావతి ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారన్న ఫీల్‌ను ఎన్నికల నాటికి కల్పించాలి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆలోచన కూడా అదేనట. అందుకే నెలకు రెండు వేల కోట్ల రూపాయల పనుల టార్గెట్‌ పెట్టినట్టు తెలుస్తోంది.

కానీ… ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. నిధులతో పాటు నిరంతర పర్యవేక్షణ, కాంట్రాక్టర్ల మీద అజమాయిషీ, అధికారుల మధ్య సమన్వయం లాంటివన్నీ చాలా కీలకం. ప్రభుత్వానికి మిగిలి ఉన్న ఈ రెండున్నరేళ్ళను, పెండింగ్‌ పనుల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని, అందుకే సీఎం ఆలక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పుకుంటున్నారు. సాధారణంగా… చంద్రబాబు ఏ పని చేసినా దాని వెనక బహుముఖ వ్యూహం ఉంటుందనేది ఆ పార్టీ నేతల విశ్వాసం. అందుకే దాన్ని ఇక్కడ కూడా అప్లయ్‌ చేసి చూస్తున్నారు. ఓ పక్కన రాజధాని అమరావతి పనులను పూర్తి చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని చెప్పడం, అమరావతిని చూపించి రాజకీయ ప్రత్యర్థులను గుక్క తిప్పుకోనికుండా చేయడం లాంటి రకరకాల అంశాలు ఈ నెలవారీ టార్గెట్‌ వెనక ఉన్నట్టు విశ్లేషిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని గనుక సాధించగలిగితే.. అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళతాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవరేం చెప్పినా… వచ్చే ఎన్నికల్లో అమరావతి నిర్మాణాలు కూడా ఒక డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌ అవుతాయన్నది ఒక పొలిటికల్‌ అనాలసిస్‌. అందుకే…. ప్రజల్ని ఓట్లు అడగడానికంటే ముందే… అమరావతికి ఒక రూపు తీసుకువచ్చి ఇదీ… మా పనితీరు చెప్పాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే… నిర్దేశించుకున్న లక్ష్యం ఏమీ సామాన్యమైంది కాదని, కూటమి ప్రభుత్వం దాన్ని చేరుకుని ఎన్నికల అజెండాగా ఎలా మారుస్తుందన్నది ఆసక్తికరమైన అంశమేనని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.