
సింగరేణి బొగ్గు గని ప్రాంత సమస్యలు, కార్మికుల సంక్షేమంపై మాజీ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న రామగుండంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు ‘సింగరేణి కార్మిక గర్జన’ అని పేరు నిర్ణయించినట్లు వెల్లడించారు. సింగరేణి సంస్థ ఆర్జించే లాభాల్లో కార్మికులకు చెల్లించాల్సిన వాటాను వెంటనే ఇవ్వాలని, అర్హులైన కార్మిక కుటుంబ సభ్యులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వీటితో పాటు ఎంతమాత్రం కాలయాపన చేయకుండా వెంటనే సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని, అలాగే ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన పెండింగ్ బిల్లుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు.
తుగ్లక్ నిర్ణయాలతో పడిపోయిన బొగ్గు ఉత్పత్తి
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత, తుగ్లక్ నిర్ణయాల వల్లే నేడు సింగరేణి సంస్థ ఆదాయం గణనీయంగా పడిపోయిందని హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. క్షేత్రస్థాయిలో కార్మికులు ఎప్పటిలాగే కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, యాజమాన్యం , ప్రభుత్వ వైఫల్యం వల్ల ఉత్పత్తి దారుణంగా తగ్గిపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏకంగా 12 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి తగ్గిపోయిందని ఆరోపించారు. గతంలో 70 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి, నేడు 58 మిలియన్ టన్నులకు పడిపోవడం ప్రభుత్వ అసమర్థ పరిపాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు
సంస్థలో సమర్థులైన, నిజాయితీ కలిగిన అధికారులను పక్కనబెట్టి, సింగరేణిని కాంగ్రెస్ నాయకులు కుంభకోణాల గనిగా మార్చేశారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఒకవైపు బొగ్గు కొరత నెపంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి, పంటలు ఎండిపోతుంటే, మరోవైపు కరెంట్ కోతలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయన్నారు. రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం అబద్ధపు ప్రకటనలతో కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే సింగరేణి పరిరక్షణ కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం రామగుండంలో నిర్వహించే ‘కార్మిక గర్జన’ సభను విజయవంతం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.