Reading Time: < 1 minute
ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఇటుక ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి, నలుగురికి సీరియస్!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామ శివారులో గురువారం (అక్టోబర్ 08) సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట–రామాయంపేట హైవేపై కారు, ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్‌పేట–భూంపల్లి మండలంలోని అక్బర్‌పేట నుంచి ఇటుకల లోడుతో ఓ ట్రాక్టర్ హబ్షీపూర్ వైపు వెళ్తుండగా.. సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చింది. హబ్షీపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారి 765 డీజీపై రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన పడిపోయింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతిన్నది.

ఢీకొన్న వెంటనే కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో వాహనంలోనే చిక్కుకుపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో గాయపడిన నలుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అతివేగమా.. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యమా.. లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలతో పాటు క్షతగాత్రుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనతో హబ్షీపూర్ పరిసరాల్లో విషాదం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..