Reading Time: 2 minutes
Bombay High Court Mumbai Garbage Crisis Bmc

ఆర్థిక రాజధాని ముంబైలో చెత్త సమస్యపై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నగరంలో కొన్ని ప్రాంతాలు శుభ్రంగా ఉన్నంత మాత్రాన ముంబై మొత్తం పరిశుభ్రంగా ఉన్నట్లు కాదని స్పష్టం చేసింది. దక్షిణ ముంబై, వర్లీ వంటి ప్రాంతాలు శుభ్రంగా ఉన్నాయని చెప్పడం ద్వారా నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్యం మెరుగ్గా ఉందని భావించలేమని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)ను ప్రశ్నించింది. చెత్త నిర్వహణలో నిర్లక్ష్యంపై న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

కాంజూర్‌మార్గ్‌ ల్యాండ్‌ఫిల్‌లో మున్సిపల్ ఘన వ్యర్థాలను పారవేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం నగరంలోని పారిశుద్ధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ముంబైలోని మొత్తం 24 మున్సిపల్ వార్డుల కోసం పరిశుభ్రత ప్రణాళిక రూపొందించినట్లు బీఎంసీ తెలిపినా.. రోడ్లపై చెత్త పేరుకుపోవడం కొనసాగుతోందని న్యాయస్థానం పేర్కొంది. “ప్రతిచోటా అపరిశుభ్రత కనిపిస్తోంది. దక్షిణ ముంబై మొత్తం నగరం కాదు. దక్షిణ ముంబై, వర్లీ వంటి ప్రాంతాలు శుభ్రంగా ఉన్నంత మాత్రాన ముంబై మొత్తం పరిశుభ్రంగా ఉన్నట్లు కాదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ముంబై పశ్చిమ శివారు ప్రాంతాల్లో చెత్త సమస్య తీవ్రంగా ఉందని హైకోర్టు పేర్కొంది. ముఖ్యంగా జోగేశ్వరి, మలాడ్ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరిశుభ్రతపై అంచనా వేయకూడదని స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలను బీఎంసీ అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించింది. ప్రాథమిక పారిశుద్ధ్య ప్రమాణాలను ప్రతి వార్డులోనూ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు వార్డు అధికారులు ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని బీఎంసీని కోరింది. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘స్వచ్ఛత అభియాన్‌’లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. తాము ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం లేదని, ముంబై ప్రజల జీవితం, ఆరోగ్యం, పరిశుభ్రతపై ఆందోళనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

గతంలోనూ హెచ్చరించిన హైకోర్టు

ముంబైలో చెత్త సమస్యపై గతంలోనూ బాంబే హైకోర్టు పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని తాజాగా అసంతృప్తి వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 10న జరిగిన విచారణలోనూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం, అక్రమంగా వ్యర్థాలను పారవేయడాన్ని అరికట్టకపోతే సంబంధిత వార్డు అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. వ్యర్థాల నిర్వహణకు దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో లోపాలు ఉన్నాయని పేర్కొంది.

ముంబైలో చెత్త నిర్వహణ, పారిశుద్ధ్య సమస్యలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు తదుపరి అక్టోబర్ 22న విచారించనుంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు బీఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వార్డు అధికారుల పనితీరుపై ఎలాంటి వివరాలు సమర్పిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.