
దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి చెందడంతో ఆయన సినీ ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు కూడా మరోసారి చర్చకు వస్తున్నాయి. నానా పటేకర్ దాంపత్య జీవితం గురించి ఓ విషయం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆయన తన భార్య నీలకాంతి పటేకర్‌తో దాదాపు 35 ఏళ్లుగా వేర్వేరుగా జీవించారు. అయితే ఇంతకాలం విడిగా ఉన్నప్పటికీ ఇద్దరూ విడాకులు మాత్రం తీసుకోలేదు. అసలు భార్యాభర్తలు ఎందుకు విడిగా ఉండాల్సి వచ్చింది? ఇన్నేళ్లు దూరంగా ఉన్నా వారి వివాహ బంధం ఎందుకు కొనసాగింది? అనే విషయాలను నానా పటేకర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. మరి వారి ప్రేమ, పెళ్లి, ఎడబాటు విషయాలను తెలుసుకుందాం..
థియేటర్‌లో మొదలైన పరిచయం.. 1978లో పెళ్లి
నానా పటేకర్, నీలకాంతి ఇద్దరికీ రంగస్థలంతో అనుబంధం ఉంది. థియేటర్‌లో పనిచేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. క్రమంగా అది ప్రేమగా మారింది. అనంతరం 1978లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
పెళ్లి సమయంలో నానా నటుడిగా తన కెరీర్‌ను నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు నీలకాంతి ఉద్యోగం చేస్తూనే రంగస్థల నాటకాల్లో నటించేవారు. నానా సంపాదన అప్పట్లో చాలా తక్కువగా ఉండేదని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఒక్కో థియేటర్ ప్రదర్శనకు తనకు కేవలం రూ.50 మాత్రమే వచ్చేదని, అదే సమయంలో నీలకాంతికి నెలకు సుమారు రూ.2,500 జీతం వచ్చేదని నానా గుర్తుచేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభ దశలో నీలకాంతి అందించిన ఆర్థిక, మానసిక సహకారం ఎంతో కీలకమని ఆయన పలుమార్లు చెప్పుకొచ్చారు.
ఇద్దరు కుమారులు.. రెండున్నరేళ్లకే పెద్ద కుమారుడి మృతి
నానా, నీలకాంతి దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు దుర్వాస, మల్హార్ పటేకర్. అయితే వారి కుటుంబ జీవితంలో విషాదం కూడా చోటుచేసుకుంది. పెద్ద కుమారుడు దుర్వాస పుట్టినప్పటి నుంచే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. కేవలం రెండున్నరేళ్ల వయసులోనే కన్నుమూశాడు. ఈ విషాదం నానా, నీలకాంతి జీవితాల్లో చెరగని ముద్ర వేసింది.
చిన్న కుమారుడు మల్హార్ మాత్రం తండ్రి బాటలో నటుడిగా కాకుండా సినిమాల వెనుక పనిచేయడాన్ని ఎంచుకున్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. నానా సాహెబ్ ప్రొడక్షన్ హౌస్‌తోనూ ఆయనకు అనుబంధం ఉంది. అయితే మల్హార్ ఎప్పుడూ మీడియా దృష్టికి దూరంగా, తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగానే ఉంచుకున్నారు.
35 ఏళ్లు ఎందుకు విడిగా ఉన్నారు?
నానా పటేకర్ దాంపత్య జీవితంలో అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఇదే. భార్యాభర్తలుగా కొనసాగుతున్నప్పటికీ.. సుమారు 35 ఏళ్ల పాటు ఇద్దరూ వేర్వేరు ఇళ్లలో జీవించారు. ఈ విషయంపై నానా పటేకర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి పెద్ద వివాదం కారణం కాదని.. వ్యక్తిత్వాలు, ఆలోచనా విధానాలు, జీవించే తీరు భిన్నంగా ఉండటమే ప్రధాన కారణమని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, ఒకే ఇంట్లో కలిసి జీవించడం ఇద్దరికీ కష్టంగా మారడంతో.. చివరకు పరస్పర అవగాహనతో వేర్వేరుగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు నానా వివరించారు. అలాగే, మరికొన్ని ఇంటర్వ్యూల్లో నీలకాంతి, తన కుమారుడు మల్హార్, నానా తల్లితో కలిసి ఉండేవారని.. తాను మాత్రం ఒంటరిగా జీవించేవాడినని నానా చెప్పినట్లు సమాచారం. “నేనే భిన్నంగా ఉన్నాను” అనే భావనను కూడా ఆయన వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
విడిపోయినా.. విడాకులు మాత్రం ఎందుకు తీసుకోలేదు?
ఇక మ్యుఖ్యంగా..విడిపోయినా.. విడాకులు మాత్రం తీసుకోకపోవడమే వారి బంధంలోని అత్యంత ఆసక్తికరమైన అంశం. భార్యాభర్తలుగా కలిసి జీవించకపోయినా.. నానా, నీలకాంతి తమ వివాహాన్ని చట్టపరంగా ముగించలేదు. వారిద్దరి మధ్య ఉన్న బంధం కాలక్రమంలో భార్యాభర్తల సంబంధాన్ని దాటి గౌరవం, కృతజ్ఞత, కుటుంబ అనుబంధంగా కొనసాగిందనే భావన నానా మాటల్లో కనిపించేది.
ముఖ్యంగా తన కెరీర్ ప్రారంభ రోజుల్లో నీలకాంతి అందించిన సహాయాన్ని నానా ఎప్పుడూ మర్చిపోలేదు. తాను నటుడిగా ఎదగాలనే కలకు ఆమె అండగా నిలిచారని.. తనకు వచ్చిన అవకాశాలు, ఎదురైన కష్టాల సమయంలో ఆమె ఇచ్చిన సహకారం ఎంతో విలువైనదని ఆయన చెప్పేవారు.
మానిషా కొయిరాలాతో రిలేషన్ పై పుకార్లు..
నానా పటేకర్, నీలకాంతి విడిగా జీవించడం ప్రారంభించిన కాలంలో.. నటి మానిషా కొయిరాలాతో నానాకు రిలేషన్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంపై నానా కానీ, నీలకాంతి కానీ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అందువల్ల ఆ ప్రచారాలను వారి విడిపోవడానికి కారణంగా చెప్పడం సరికాదు. నానా మాత్రం తమ విడివిడిగా జీవించడానికి ప్రధాన కారణం వ్యక్తిత్వాలు, ఆలోచనల్లో ఉన్న తేడాలేనని చెప్పినట్లు సమాచారం.
నటిగా, బ్యాంకు అధికారిణిగా.. నీలకాంతి ప్రత్యేక గుర్తింపు..
నీలకాంతి కూడా కళారంగానికి చెందినవారే. చిన్న వయసులోనే నటనలోకి అడుగుపెట్టిన ఆమె.. అనంతరం మరాఠీ థియేటర్, సినిమాల్లో పనిచేశారు. కొంతకాలం బ్యాంకు జాబ్ కూడా చేసింది. ఈ క్రమంలోనే మరాఠీ చిత్రం ‘ఆత్మవిశ్వాస్’లో నటనకు గానూ ఆమెకు మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డు లభించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ చిత్రంతో మరోసారి తెరపై కనిపించారు.
వ్యక్తిగత జీవితంలో నానా ఎంతో గోప్యత
‘వెల్‌కమ్’, ‘తిరంగా’, ‘సలామ్ బాంబే!’, ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ వంటి చిత్రాలతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన నానా పటేకర్.. తన కుటుంబ విషయాలను మాత్రం ఎప్పుడూ పెద్దగా బయటకు రానివ్వలేదు. భార్యతో దశాబ్దాల పాటు విడిగా జీవించినా.. విడాకులు తీసుకోకుండా ఆ బంధాన్ని కొనసాగించడం, నీలకాంతి చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవడం ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని చూపిస్తుంది. వారి మధ్య దూరం ఉన్నప్పటికీ.. పరస్పర గౌరవం, కుటుంబ అనుబంధం మాత్రం కొనసాగినట్లు నానా గత వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
సినిమాల్లో తన గంభీరమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నానా పటేకర్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం తన బంధాలను, భావోద్వేగాలను చాలా వరకు తనలోనే దాచుకున్నారు. ఆయన మరణంతో ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఈ 35 ఏళ్ల దాంపత్య కథ.. నానా జీవితంలోని మరో ఆసక్తికరమైన, భావోద్వేగభరితమైన అధ్యాయంగా నిలిచిపోయింది.