
విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆశ చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొంతమంది అత్యాశకు పోయి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా రష్యాకు వెళ్లిన కొంతమంది భారతీయులు.. అక్కడ సైన్యంలో చిక్కుకున్నారు. నరకం చూస్తున్నారు. ఇందులో మన తెలంగాణ వాళ్లు కూడా ఉన్నారు. అసలు రష్యా సైన్యంలో భారతీయులు ఎలా చిక్కుకున్నారు? వాళ్లు ఎలా మోసపోయారు..? వీళ్లకోసం భారత ప్రభుత్వం ఏం చేస్తోంది..?
ఉద్యోగాల ఆశ చూపించి కొందరు దళారులు అమాయకులను రష్యాకు తరలిస్తున్నారు. ఆపై వారిని బలవంతంగా యుద్ధరంగంలోకి దించుతున్నారు.రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయల అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా సైనికుల కొరతతో రష్యా సతమతమవుతోంది. దొరికినవారందరినీ సైన్యంలోకి బలవంతంగా లాక్కుంటోంది. ఇందులో మన దేశానికి చెందిన యువకులు కూడా బలికావడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. నెలకు 2 లక్షల జీతం, 8 లక్షల ఇన్సూరెన్స్ బోనస్ ఇస్తామంటూ కొందరు ఏజెంట్లు అమాయక యువతను రష్యాకు రప్పిస్తున్నారు. ఎంతో ఆశతో అడుగుపెట్టిన ఆ యువకులకు అక్కడికి వెళ్లాక వాస్తవాలు తెలుస్తున్నాయి. దీంతో వాళ్ల గుండెలు ఆగిపోతున్నాయి. కలలో కూడా ఊహించని యుద్ధ భూమికి వారిని నెట్టేస్తున్నారు.
రష్యా సైన్యంలో ఇప్పటివరకూ వందల సంఖ్యలో భారతీయులు చిక్కుకున్నారు. వాళ్లలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 259 మంది భారతీయులు రష్యా సాయుధ దళాల్లోకి రిక్రూట్ అయినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 51 మంది ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయారు. 69 మంది ఇంకా సైన్యంలోనే కొనసాగుతున్నారు. మన ప్రభుత్వం చొరవ తీసుకుని ఇప్పటివరకు 139 మందిని సురక్షితంగా రప్పించింది. మిగిలిన వారిని కూడా త్వరగా విడిపించేందుకు మాస్కోతో చర్చలు జరుపుతోంది. “ఇలా చేపడం తప్పని, ప్రాణాలకే ముప్పు అని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తున్నా.. విదేశీ ఉద్యోగాల మోజులో పడిన కొందరు యువకులు ఈ మాయలో చిక్కుకుంటూనే ఉన్నారు.
ఈ మోసాల తీరును గమనిస్తే.. మోసగాళ్ళు ఎంత పక్కాగా వల పన్నుతున్నారో అర్థమవుతుంది. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన కస్తూరి తిరుపతి ఉదంతమే ఇందుకు నిదర్శనం. సెప్టెంబర్ 27న రష్యాకు వెళ్లిన ఆయనకు నెలకు దాదాపు 2 లక్షల జీతం, 8 లక్షల ఇన్సూరెన్స్ బోనస్ ఇస్తామని నమ్మించారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత అసలు రంగు బయటపడింది. వారిని నేరుగా ఒక మిలిటరీ క్యాంపునకు తీసుకెళ్లారు. సైనికులుగా విధులు నిర్వర్తించాలంటూ బలవంతం చేశారు. తిరుపతితో పాటు అక్కడ చిక్కుకున్న దాదాపు 30 మంది యువకులు భారత విదేశాంగ శాఖ సహాయంతో బయటపడగలిగారు. ప్రస్తుతం తిరుపతి సహా ముగ్గురు మాత్రమే భారత్‌కు తిరిగి రాగా, ఇంకా 20 మందికి పైగా అక్కడే ఉండిపోయారు.
తెలంగాణతో పాటు పంజాబ్, కర్ణాటక, గుజరాత్, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి బాధితులు ఉన్నారు. రష్యా ప్రభుత్వ కార్యాలయాల్లో క్లీనర్లు, సహాయకులు లేదా కన్‌స్ట్రక్షన్ పనుల కోసం అంటూ వీళ్లను ఏజెంట్లు అక్కడికి తీసుకెళ్తున్నారు. రష్యా చేరుకున్నాక చదవలేని భాషలో ఉన్న కాంట్రాక్ట్ పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మాజీ సైనికుడు ఉర్గెన్ తామాంగ్ కూడా ఇలాగే మోసపోయారు. తను యుద్ధంలో పోరాడాల్సి వస్తోందంటూ వీడియో ద్వారా కన్నీటిపర్యంతమయ్యారు. భారత ప్రభుత్వం సాయం చేయాలంటూ వేడుకున్నారు.
అమాయక యువతను రష్యా సైన్యంలోకి నెట్టేస్తున్న ఈ అక్రమ రిక్రూట్‌మెంట్ దందాను అణచివేయడానికి భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మార్చి 2024 నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుల ఆధారంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు స్పందిస్తోంది. రష్యా అధికారులతో దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటివరకు 139 మందిని క్షేమంగా వెనక్కి రప్పించడంలో సఫలమైంది. ఇంకా అక్కడే చిక్కుకున్న వారికి విముక్తి కల్పించేందుకు మాస్కోపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి మోసపోవద్దని.. విదేశాంగ శాఖ గట్టిగా హెచ్చరించింది.
సోషల్ మీడియాలో ప్రకటనలు, దళారుల మాయమాటలు నమ్మితే విదేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో రష్యా ఘటనలు మనకు చాటిచెప్తున్నాయి. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉంటే మంచిది.
:- CLN RAJU (EDITOR- NTV DIGITAL)