Reading Time: 3 minutes

లెక్కల్లో వీక్.. తెలుగు, ఇంగ్లిష్ లోనూ అంతంతే..! బేస్‌‌ లైన్ టెస్టుల్లో.. బెంచ్‌‌ మార్క్ అందుకోలేని సర్కార్ స్టూడెంట్లు.. 

Caption of Image.
  • 80 శాతం మార్కులు సాధిస్తేనే నైపుణ్యం ఉన్నట్టు గుర్తింపు 
  • ఏ తరగతి చూసినా సింగిల్ డిజిట్‌‌‌‌‌‌‌‌లోనే కాంపిటెంట్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఆశించిన మేర ప్రతిభ చూపించడం లేదు. గణితంలో బలహీనంగా ఉండగా, తెలుగు, ఇంగ్టిష్‌‌లోనూ అంతంతమాత్రంగానే రాణిస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్ నిర్వహించిన ‘స్టేట్ కన్సాలిడేటెడ్ బేస్‌‌లైన్ టెస్ట్’ (2 నుంచి 5వ తరగతి) ఫలితాల్లో ఈ విషయం బహిర్గతమైంది. 

ప్రతి సామర్థ్యంలో కనీసం 80 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు రాస్తేనే ఆ విద్యార్థికి ఆ రంగంలో పట్టు (కాంపిటెంట్) ఉన్నట్లు విద్యాశాఖ లెక్కగట్టింది. అయితే, క్షేత్రస్థాయిలో ఈ 80 శాతం బెంచ్‌‌మార్క్‌‌ను అందుకోవడంలో అత్యధిక శాతం విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఉదాహరణకు, ఐదో తరగతిలో భాగాహారంలో 80 శాతం మార్కులు తెచ్చుకున్నది కేవలం 16.20 శాతం మందే కాగా, మిగిలిన 83.80 శాతం మంది వెనుకబడ్డారు. అన్ని నైపుణ్యాల్లోనూ పూర్తి సామర్థ్యం సాధించిన పిల్లల సంఖ్య చాలావరకు సింగిల్ డిజిట్‌‌కే పరిమితమైంది.

అంకెలు దాటితే ఆగమాగం..

ప్రాథమిక విద్యార్థుల్లో గణిత భయం స్పష్టంగా కనిపిస్తోంది. సంఖ్యలను గుర్తించడం వరకే పరిమితమవుతున్న పిల్లలు.. భాగాహారాలు, గుణకారాల వద్ద 80 శాతం మార్కుల బెంచ్‌‌మార్క్ అందుకోలేకపోతున్నారు. రెండో తరగతిలో అంకెలను గుర్తుపట్టడంలో 53 శాతం, పోల్చడంలో 49.40 శాతం, కూడికల్లో 43.40 శాతం మంది విద్యార్థులు 80 శాతం మార్కులు సాధించగా.. తీసివేతల్లో 31.30 శాతమే తెచ్చుకున్నారు. అన్నిట్లో పూర్తి సామర్థ్యం పొందినవారు 21.70 శాతంగా నమోదయ్యారు. మూడో తరగతిలో కూడికలు 54.40 శాతం, తీసివేతలు 47.70 శాతం మంది చేయగలిగినా.. గుణకారం 24.40 శాతం, భాగాహారం కేవలం 9.90 శాతం మందికే వస్తోంది. 

పూర్తి సామర్థ్యం 7.80 శాతానికి పడిపోయింది. నాలుగో తరగతిలో కూడికలు 57.80 శాతం, తీసివేతలు 35.10 శాతం ఉన్నా.. గుణకారం 24.20 శాతం, భాగాహారం 14.20 శాతం మందికే వచ్చాయి. పూర్తి సామర్థ్యం 10.60 శాతమే. ఐదో తరగతిలో కూడికలు 67.60 శాతం, తీసివేతలు 47.70 శాతం మంది చేయగలుగుతున్నా.. గుణకారం 29.10 శాతం, భాగాహారం 16.20 శాతం మందికి మాత్రమే వస్తోంది. అంటే దాదాపు 84 శాతం మంది ఐదో తరగతి పిల్లలకు భాగాహారం చేతకాదు. ఫలితంగా పూర్తి సామర్థ్యం ఉన్నవారు 13.50 శాతానికే పరిమితమయ్యారు.

ఇంగ్లిష్, ఉర్దూ మీడియంల తీరు..

ఇంగ్లిష్ మీడియంలోనూ ఆశించిన సామర్థ్యాలు కనిపించడం లేదు. రెండో తరగతిలో ఇంగ్లిష్ పదాలు చదవడంలో 23.80 శాతం, ధారాళంగా చదవడంలో 12.60 శాతం, వాక్యాల పఠనంలో 19.20 శాతం, రాతలో 17.30 శాతం మంది 80 శాతం మార్కులు సాధించగా, పూర్తి సామర్థ్యం 4.50 శాతమే. మూడో తరగతిలో వాక్యాలు చదవడంలో 31.10 శాతం, అర్థం చేసుకోవడంలో 25.30 శాతం మంది రాణించినా.. రాతలో 10.80 శాతం, ధారాళంగా చదవడంలో 18.20 శాతం మందే బెంచ్‌‌మార్క్ దాటారు (పూర్తి సామర్థ్యం 5.20 శాతం). నాలుగో తరగతిలో ధారాళంగా చదవడంలో 23.60 శాతం, వాక్యాలు చదవడంలో 44.10 శాతం, రాతలో 17 శాతం మంది రాణించారు (పూర్తి సామర్థ్యం 9.10 శాతం). 

ఐదో తరగతిలో వాక్యాలు చదవడంలో 48.30 శాతం మంది మార్కులు తెచ్చుకున్నా.. ధారాళంగా చదవడంలో 17.50 శాతం, రాయడంలో 20.20 శాతం మందే సాధించారు (పూర్తి సామర్థ్యం 8.40 శాతం). ఇక ఉర్దూలో రెండో తరగతిలో పూర్తి సామర్థ్యం 1.30 శాతం, మూడో తరగతిలో 3.30 శాతం, నాలుగో తరగతిలో 6.20 శాతం, ఐదో తరగతిలో 9.10 శాతానికి పరిమితమైంది.

టాప్‌‌లో పెద్దపల్లి, ఖమ్మం.. అట్టడుగున సంగారెడ్డి, హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలు అత్యధిక సబ్జెక్టుల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి టాప్‌‌లో నిలిచాయి. సూర్యాపేట, హనుమకొండ, జగిత్యాల జిల్లాలు కూడా ముందంజలో ఉన్నాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా దాదాపు అన్ని తరగతులు, సబ్జెక్టుల్లో రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానంలో నిలిచింది. సంగారెడ్డిలో రెండో తరగతి తెలుగు పూర్తి సామర్థ్యం 0.20 శాతం, ఇంగ్లిష్ 0.70 శాతం, లెక్కల్లో 4.20 శాతానికే పరిమితమయ్యాయి. 

ఐదో తరగతిలోనూ తెలుగు పూర్తి సామర్థ్యం 1.10 శాతం, ఇంగ్లిష్ 1.30 శాతాన్ని మించలేదు. రాజధాని హైదరాబాద్‌‌లోనూ రెండో తరగతి తెలుగు సామర్థ్యం 0.80 శాతం, నాలుగో తరగతి తెలుగు 1.80 శాతం, మూడో తరగతి లెక్కల్లో 3.80 శాతమే నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలు సైతం అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో బోధన మెరుగుపరచకపోతే విద్యార్థులు మరింత వెనుకబడిపోతారని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. 

మాతృభాషలోనూ తడబాటు..

తెలుగులోనూ పిల్లలు 80 శాతం మార్కుల బెంచ్‌‌మార్క్ అందుకోలేకపోతున్నారు. రెండో తరగతిలో పదాలు చదవడంలో 24.80 శాతం, వాక్యాల పఠనంలో 16.10 శాతం, రాతలో 23.20 శాతం మంది మాత్రమే 80 శాతం మార్కులు సాధించారు. నిమిషానికి 25 పదాలు చదివే బెంచ్‌‌మార్క్‌‌ను 7.30 శాతం మంది మాత్రమే అందుకోగా, పూర్తి సామర్థ్యం పొందినవారు కేవలం 2.20 శాతం మందే ఉన్నారు. 

మూడో తరగతిలో వాక్యాలు చదవడంలో 38 శాతం, గ్రహణశక్తిలో 40 శాతం మంది రాణించినా.. ధారాళంగా చదవడంలో 12.60 శాతం, రాతలో 11.90 శాతం మందే ఆ మార్కులు పొందారు (పూర్తి సామర్థ్యం 4.60 శాతం). నాలుగో తరగతిలో ధారాళంగా చదవడం 8.30 శాతం మందికే రాగా, రాతలో 19.70 శాతం మంది సాధించారు (పూర్తి సామర్థ్యం 4.40 శాతం). ఐదో తరగతిలో వాక్యాలు చదవడంలో 55 శాతం మంది బెంచ్‌‌మార్క్ దాటినా.. ధారాళంగా చదవడంలో 15.70 శాతం, రాతలో 20.30 శాతం (పూర్తి సామర్థ్యం 8.80 శాతం) మందే ఆ మార్కులు తెచ్చుకున్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.